మెళవాయిలో హైకోర్టు జడ్జి చంద్ర ధనశేఖర్ పర్యటన
మడకశిరరూరల్: మండల పరిధిలోని మెళవాయి గ్రామంలో శనివారం ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ తోట చంద్ర ధనశేఖర్ పర్యటించారు. గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమర యోధుడు, సీనియర్ న్యాయవాది గోవిందరెడ్డిని ఆయన పరామర్శించారు. గోవిందరెడ్డి ఆరోగ్య సమాచారం అడిగి తెలుసుకున్నారు. గోవిందరెడ్డి దంపతులకు శాలువా కప్పి సన్మానించారు. జస్టిస్ తోట చంద్ర ధనశేఖర్‌కు గోవిందరెడ్డి కుటుంబసభ్యులు పుష్పగుచ్ఛం అందించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తి శైలజ, మడకశిర జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఆర్. అశోక్‌కుమార్, హైకోర్టు న్యాయవాది చిన్నప్పరెడ్డి, సర్పంచ్ రంగనాథ్, అధికారులు పాల్గొన్నారు.
ఇసుక టిప్పర్ పట్టివేత
శింగనమల: వైఎస్సార్ కడప జిల్లా వేటూరు నుంచి ఇసుక తరలిస్తున్న టిప్పరును శనివారం శింగనమల క్రాస్‌లో మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కేసు నమోదు చేసి శింగనమల పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు జిల్లా మైనింగ్ డీడీ ఆదినారాయణ తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో మైనింగ్ ఆర్‌ఐ సుప్రజ పాల్గొన్నారు.


