
వ్యసనాలకు అలవాటుపడి.. దొంగగా మారి
పుట్లూరు: వ్యసనాలు ఆ యువకుడిని దొంగగా మార్చాయి. చోరీలు చేస్తూ వచ్చిన సొమ్ముతో జల్సాలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ సత్యబాబు శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మండల కేంద్రం పుట్లూరులోని బీసీ కాలనీలో ఈ నెల 22న చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. చోరీలు జరిగిన తీరు, పాత నేరస్తుల కదలికలతో పాటు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టారు. బీసీ కాలనీకి చెందిన దాసప్పగారి బాలచంద్ర అలియాస్ బాలును అనుమానితునిగా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బీసీ కాలనీలో జరిగిన చోరీతో పాటు గ్రామంలోని జనరల్ స్టోర్‌లో జరిగిన దొంగతనం కూడా బాలునే చేసినట్లు విచారణలో తేల్చారు. కూలి పనులు చేసుకునే ఇతడు ఆన్‌లైన్ గేమ్, పేకాట తదితర జూదాలకు డబ్బు అవసరమై దొంగతనాల బాట ఎంచుకున్నట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఈ మేరకు బాలును శనివారం అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి మూడు జతల బంగారు కమ్మలు, 8 గ్రాముల చైన్, రెండు ఉంగరాలు, 25 తులాల వెండి గొలుసులతో పాటు జనరల్ స్టోర్‌లో చోరీ చేసిన రూ.7,450 నగదును రికవరీ చేసినట్లు సీఐ వివరించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో యల్లనూరు ఎస్‌ఐ రామాంజనేయరెడ్డి, ట్రైనీ ఎస్‌ఐలు రామక్రిష్ణ, సురేష్, కానిస్టేబుళ్లు వెంకటేష్, షెక్షావలి, నరేష్, రాము, రమేష్ పాల్గొన్నారు.