
ఎట్టకేలకు ఎరువులు వచ్చాయ్
అనంతపురం అగ్రికల్చర్: ఎట్టకేలకు యారియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులు శనివారం అనంతపురం చేరాయి. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ (ఆర్‌సీఎఫ్) కంపెనీ నుంచి వచ్చిన ఎరువులకు స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్‌పాయింట్‌లో రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్‌తో పాటు విజిలెన్స్ ఎస్పీ ప్రసాద్ తదితరులు పరిశీలించారు. 500 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కాగా.. అందులో మార్క్‌ఫెడ్ 350 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ హోల్‌సేల్‌డీలర్లకు 150 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు ఏడీఏ తెలిపారు. ఇందులో అనంతపురం జిల్లాకు 388 మెట్రిక్ టన్నులు కాగా.. శ్రీసత్యసాయి జిల్లాకు 112 మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తామని వెల్లడించారు. ఇక 15–15–15 రకం కాంప్లెక్స్ ఎరువులు 854 మెట్రిక్ టన్నులు రాగా.. అందులో అనంతపురం జిల్లాకు 574 మెట్రిక్ టన్నులు, శ్రీసత్యసాయి జిల్లాకు 280 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు తెలిపారు. సోమవారం నుంచి ఆర్‌ఎస్‌కేలు, సొసైటీలతో పాటు ప్రైవేట్ డీలర్ల దగ్గర తగినంత యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్ అధికారులు తెలిపారు.
ఇద్దరికి ప్రొఫెసర్లుగా పదోన్నతి
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి లభించింది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్ పోస్టులకు కౌన్సెలింగ్ జరిగింది. కాగా ఈఎన్‌టీ విభాగానికి సంబంధించి అసోసియేట్ ప్రొఫెసర్, ప్రస్తుత ఇన్‌చార్జ్ హెచ్‌ఓడీగా ఉన్న డాక్టర్ రాజేష్‌కుమార్‌కు, మానసిక వైద్య విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్ శారదకు ప్రొఫెసర్లుగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా తోటి వైద్యులు, కిందిస్థాయి సిబ్బంది వారికి అభినందనలు తెలిపారు. వీరిద్దరికీ ప్రొఫెసర్లుగా అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోనే పోస్టింగ్ వచ్చింది.
డ్రిప్ పరికరాలు అందించండి
పుట్టపర్తి అర్బన్: ఈ ఆర్థిక సంవత్సరాని(2024–25)కి సంబంధించి డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలను వారంలోపు అందించాలని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ పేర్కొన్నారు. శనివారం పీడీ తన కార్యాలయంలో 23 డ్రిప్పు, స్ప్రింక్లర్ పరికరాలను అందించే ఏజెన్సీ నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12,044 హెక్టార్లకు సంబంధించి రైతులకు పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ పరికరాలను వారం లోపు అందించి ఇన్‌స్టలేషన్ పూర్తి చేయాలన్నారు. ఇక 2025–26సంవత్సరానికి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. డీడీ (లింక్ ద్వారా) తీసుకొని ఎస్టిమేషన్ వేసి అప్రూవల్‌కు పంపాలన్నారు. రైతుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ డీడీలు స్వీకరించకుండా కేవలం లింక్ ద్వారానే డీలర్‌కు పంపాలన్నారు.
వైద్య విద్య కార్యక్రమాలతో నూతన ఆవిష్కరణలు
అనంతపురం మెడికల్: నిరంతర వైద్య విద్య కార్యక్రమాల ద్వారా నూతన ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుందని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ షారోన్ సోనియా పేర్కొన్నారు. శనివారం ప్రభుత్వ వైద్య కళాశాలలో మైక్రో బయాలజీ విభాగానికి సంబంధించి సీఎంఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. వైద్య కళాశాలలో యూజీ, పీజీ సీట్లు పుష్కలంగా ఉన్నాయన్నారు. వైద్యులు నూతన ఆవిష్కరణలపై దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మధుసూదన్, ప్రొఫెసర్ శాంతిరెడ్డి, డాక్టర్ ఆదిరెడ్డి పరదేశీనాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఎట్టకేలకు ఎరువులు వచ్చాయ్

ఎట్టకేలకు ఎరువులు వచ్చాయ్

ఎట్టకేలకు ఎరువులు వచ్చాయ్