
నేర నియంత్రణకు పకడ్బందీ చర్యలు
పుట్టపర్తి టౌన్: నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎస్పీ రత్న పోలీసులను ఆదేశించారు. ముఖ్యంగా పెండింగ్ కేసుల దర్యాప్తునకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. శనివారం ఆమె జిల్లా పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నేర సమీక్ష నిర్వహించారు. సబ్ డివిజన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ కేసుల ఛేదింపుల్లో కృషి చేసిన పోలీసులకు ప్రశంసాపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... కేసుల దర్యాప్తులో సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. వినాయక చవితి పండుగ నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. మహిళలు, బాలికలపై నేరాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. కళాశాలలు, పాఠశాలలు వద్ద శక్తి టీం ద్వారా ఈవ్‌టీజింగ్ నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
బెట్టింగ్‌లపై ఉక్కుపాదం మోపండి
బెట్టింగ్‌పై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ రత్న పోలీసులను ఆదేశించారు. ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, మట్కా జిల్లాలో ఎక్కడా జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ నేరాల్లో నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టీంలు ఏర్పాటు చేయాలన్నారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచాలని, రాత్రి సమయాల్లో గస్తీలు ముమ్మరం చేసి చోరీల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. డయల్ 100కు వచ్చే కాల్స్‌కు వెంటనే స్పందించాలన్నారు. పోక్సో కేసుల్లో నివేదికలు త్వరగా సిద్ధం చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలను పూర్తిగా కట్టడి చేయాలన్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలను తరచూ సందర్శించి అక్కడి సమస్యలు తెలుసుకుంటూ ఉండాలన్నారు. అలాగే పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు విజయకుమార్, శివన్నారాయణస్వామి, మహేష్, హేమంత్‌కుమార్, నర్సింగప్ప, డీసీఆర్‌బీ సీఐ శ్రీనివాసులు, ఐటీకోర్ ఇన్‌చార్జ్ సుదర్శన్‌రెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పెండింగ్ కేసుల దర్యాప్తునకు
అత్యధిక ప్రాధాన్యత ఇవ్వండి
చవితి ఉత్సవాలకు
పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలి
క్రికెట్ బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్ నిరోధంపై దృష్టి సారించండి
నేర సమీక్ష సమావేశంలో
పోలీసులకు ఎస్పీ రత్న ఆదేశం