
డీఎస్సీలో సత్తాచాటిన ధర్మవరం అభ్యర్థులు
ధర్మవరం అర్బన్: డీఎస్సీ పరీక్ష ఫలితాల్లో ధర్మవరం అభ్యర్థులు జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. పట్టణంలోని కేశవనగర్‌కు చెందిన చేనేత కార్మికుడు చింతా పరమేశ్వర్, చింతా పద్మావతి దంపతుల కుమార్తె దివ్యశ్రీ డీఎస్సీ ఎస్‌జీటీ పరీక్ష ఫలితాల్లో 92.79 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. దివ్యశ్రీ పదో తరగతి, ఇంటర్ ధర్మవరంలో చదివి టీటీసీ బుక్కపట్నం డైట్ కళాశాలలో చదివారు. ఓపెన్ డిగ్రీ, బీఈడీ చేశారు. అనంతపురంలో శిక్షణ తీసుకున్నారు. డీఎస్సీలో దివ్యశ్రీ జిల్లాస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే ధర్మవరం వైఎస్సార్ కాలనీకి చెందిన చేనేత కుటుంబానికి చెందిన ఉక్కిశిల సంగప్ప, ఈశ్వరమ్మ దంపతుల కుమారుడు సాయికుమార్ డీఎస్సీ పరీక్ష ఫలితాల్లో 92.70 మార్కులు సాధించి జిల్లాస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచారు. పదో తరగతి, ఇంటర్ ధర్మవరంలో పూర్తిచేసిన సాయికుమార్ బుక్కపట్నం డైట్ కళాశాలలో టీటీసీ పూర్తి చేశారు. అనంతపురంలో శిక్షణ పొంది డీఎస్సీ పరీక్షలో ప్రతిభ చూపి జిల్లాస్థాయిలో ద్వితీయస్థానంలో నిలిచారు. దీంతో తల్లిదండ్రులు తమ కుమారుడికి స్వీట్లు తినిపించి ఆనందం పంచుకున్నారు.
జిల్లా ప్రథమ, ద్వితీయ
స్థానాలు కై వసం

డీఎస్సీలో సత్తాచాటిన ధర్మవరం అభ్యర్థులు