
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
రాప్తాడు: మండల కేంద్రానికి చెందిన మాజీ స్టోర్ డీలర్, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ మండల కన్వీనర్ జూటూరు లక్ష్మన్న తనకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించాలని రాప్తాడు పోలీసుస్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. బాధితుడి వివరాలమేరకు.. ఈ ఏడాది మే 14న పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సీఐ సార్‌ను కలవాలని తనకు ఫోన్ వచ్చిందన్నారు. తాను పోలీసుస్టేషన్ లోపలికి వెళ్తుండగా.. రాప్తాడుకు చెందిన మారుతీ, నారాయణ, జగదీష్‌లు పోలీస్‌స్టేషన్ ముందే తనపై దాడి చేశారన్నారు. ఎందుకు కొడుతున్నారని అడిగినా చెప్పలేదన్నారు. వారిపై కేసు నమోదు చేయాలని అప్పట్లో ఫిర్యాదు చేసినా నేటికీ పోలీసులు స్పందించలేదన్నారు.
నిన్ను కొడితే దిక్కెవరు?
తాజాగా శనివారం సాయంత్రం ఎస్సీ కాలనీలోని తన ఇంటి ముందు కూర్చొని ఉండగా గతంలో దాడి చేసిన నారాయణ మళ్లీ దాడికి యత్నించాడని లక్ష్మన్న ఆవేదన వ్యక్తం చేశారు. బండి ఎక్కు .. నీతో పని ఉందని బూతులు తిట్టారన్నారు. కొడితే దిక్కెవరని, పోలీసులు కూడా మేమంటే భయపడతారన్నారన్నారు. నారాయణ నుంచి తప్పించుకొని, వచ్చి నారాయణ, మారుతీ, జగదీష్‌ల నుంచి తనకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించాలని మరోసారి పోలీసులను వేడుకున్నానని లక్ష్మన్న తెలియజేశారు.
సమష్టి కృషితో ‘స్వచ్ఛత’
పుట్టపర్తి టౌన్: సమష్టి కృషితోనే ‘స్వచ్ఛత’ సాధ్యమవుతుందని, అందువల్ల ఎవరికి వారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపు నిచ్చారు. ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం పుట్టపర్తిలో విద్యార్థులు, అధికారులు, మున్సిపల్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక సత్యమ్మ ఆలయం వద్ద కలెక్టర్ చేతన్ ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ర్యాలీ మున్సిపల్ కార్యాలయం మీదుగా చిత్రావతి బ్రిడ్జి వరకూ సాగింది. అక్కడ మానవహారం ఏర్పాటు చేసి కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... జిల్లాను స్వచ్ఛతలో తొలిస్థానంలో ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కొంత సమయం కేటాయించాలన్నారు. వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలన్నారు.

ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి