బత్తలపల్లి: ప్రేమించిన బంధువుల అమ్మాయితో పెళ్లికి యువతి తల్లిదండ్రులు నిరాకరించడంతో క్షణికావేశానికి లోనై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బత్తలపల్లి మండలం రాఘవంపల్లి గ్రామానికి చెందిన తలారి నరసింహులు కుమారుడు తలారి గుణ (18) తన బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు వారి ప్రేమను అంగీకరించకపోవడంతో క్షణికావేశంలో గురువారం రాత్రి తన మామిడి తోటలోని చెట్టుకు చీరతో ఉరి చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి నరసింహులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
వ్యక్తి బలవన్మరణం
ఎన్‌పీకుంట: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ఎన్‌పీకుంట మండలం ధనియాని చెరువు గ్రామానికి చెందిన వల్లెపు మునెప్ప (59)కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కాలికి గాయం కావడంతో కొంత కాలంగా ఏ పని చేయలేక ఇంటి పట్టునే ఉంటూ వచ్చాడు. దీంతో కుటుంబ అవసరాలు, చికిత్స కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక గురువారం రాత్రి క్రిమి సంహారక మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతనిని కుటుంబ సభ్యులు గమనించి కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రేమ పెళ్లికి నిరాకరణ.. యువకుడి ఆత్మహత్య