రెండేళ్లలో మెడికల్‌ కళాశాలను ప్రారంభిస్తాం | - | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో మెడికల్‌ కళాశాలను ప్రారంభిస్తాం

Aug 23 2025 6:17 AM | Updated on Aug 23 2025 6:17 AM

రెండే

రెండేళ్లలో మెడికల్‌ కళాశాలను ప్రారంభిస్తాం

సోమందేపల్లి: పెనుకొండలో ఏర్పాటు చేస్తున్న మెడికల్‌ కళాశాలను 2027 నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మంత్రి సవిత, ఎంపీ పార్థసారథితో కలిసి సోమందేపల్లిలోని నక్కల గుట్ట కాలనీలో కృష్ణుడి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్‌ మాట్లాడుతూ... మెడికల్‌ కళాశాల అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత వాసులకు సూపర్‌స్పెషాలిటీ వైద్యం అందడంతో పాటు మెడికల్‌ సీట్లు పెరుగుతాయన్నారు. రాబోయే రెండేళ్లలో కళాశాల నిర్మాణం పూర్తి చేసి సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కేశవయ్య, ఎంపీపీ ఆది నారాయణ పాల్గొన్నారు.

లక్ష్యాలన్నీ సకాలంలో

పూర్తి చేయాలి

అధికారులకు కలెక్టర్‌ చేతన్‌ ఆదేశం

ప్రశాంతి నిలయం: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి మున్సిపల్‌ కమిషనర్లు, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలు, మండల వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వివిధ అంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ... ప్రభుత్వానికి పంపాల్సిన ప్రతి సమాచారాన్ని సకాలంలో పంపే బాధ్యత ఆయాశాఖల ఉన్నతాధికారులపై ఉంటుందన్నారు. ఓటరు జాబితా మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తులను ఈఆర్‌ఓలు ఎప్పటికప్పుడు ఆప్‌లోడ్‌ చేసేలా ఆర్డీఓలు చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ ఉద్యోగులంతా బయోమెట్రిక్‌ హాజరు వేసేలా చూడాలన్నారు. ఈ–క్రాప్‌కు సంబంధించిన ఈ–కేవైసీ పెండింగ్‌లో లేకుండా వీఆర్‌ఓలు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటింటి నుంచి చెత్తసేకరణపై కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఓవర్‌హెడ్‌ ట్యాంకులు శుభ్రం చేయాలని, తాగునీటి పైపులు లీకేజీ లేకుండా చూడాలన్నారు. వర్షాల వల్ల దోమలు అభివృద్ధి చెందకుండా ఫాగింగ్‌ చేయాలన్నారు. ఎక్కడా తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పబ్లిక్‌ టాయిలెట్లకు నిరంతరం నీటి సరఫరా ఉండాలన్నారు. నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామ, మండల స్థాయిలో చేపట్టాల్సిన వివిధ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, సీపీఓ విజయ్‌ కుమార్‌, డీపీఓ సుమత, ఇన్‌చార్జ్‌ డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అప్పు చెల్లించలేదని దాడి

ధర్మవరం అర్బన్‌: అప్పు చెల్లించలేదంటూ ఓ లారీ డ్రైవర్‌పై వడ్డీ వ్యాపారి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ధర్మవరం రెండో పట్టణ సీఐ రెడ్డప్ప తెలిపిన మేరకు.. నార్పల మండలానికి చెందిన గోదిన గురుప్రసాద్‌ లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఏడాది క్రితం తాడిపత్రి పట్టణానికి చెందిన జోసఫ్‌తో రూ.50 వేలను అప్పుగా తీసుకున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో కంతులు సక్రమంగా చెల్లించలేకపోయాడు. ఈ క్రమంలో ఈ నెల 18న లారీలో సిమెంట్‌ లోడ్‌తో వెళుతున్న గురుప్రసాద్‌ను ధర్మవరంలోని మార్కెట్‌యార్డు వద్ద జోసఫ్‌ అడ్డుకుని తన అనుచరులు బాబా ఫకృద్దీన్‌, ఖాసీం, సునీల్‌, అబ్దుల్లా, మరో వ్యక్తితో కలసి విచక్షణారహితంగా దాడి చేశాడు. బెల్టు, కాళ్లు, చేతులతో కొట్టడంతో తీవ్రంగా గాయపడిన గురుప్రసాద్‌ తన సొంతూరికి వెళ్లి కోలుకున్న తర్వాత శుక్రవారం ధర్మవరం రెండో పట్టణ పీఎస్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. దీంతో దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రెండేళ్లలో మెడికల్‌  కళాశాలను ప్రారంభిస్తాం 1
1/1

రెండేళ్లలో మెడికల్‌ కళాశాలను ప్రారంభిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement