
గంజాయి ముఠా అరెస్ట్
కదిరి అర్బన్: గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఆరుగురు సభ్యులుగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం కదిరి రూరల్ అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శివనారాయణస్వామి గంజాయి ముఠా వివరాలు వెల్లడించారు.
ఆరుగురు ముఠాగా ఏర్పడి..
పట్టణంలోని జామియా వీధికి చెందిన అజాజ్ తన స్నేహితులు నాగరాజు వీధికి చెందిన షోయబ్, గాంధీనగర్‌కు చెందిన అర్ఫాన్, మహ్మద్ హుస్సేన్, అస్లాం, గౌస్‌బాషాతో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. గంజాయి విక్రయాలతో డబ్బు సంపాదించాలనుకున్న అజాజ్ మహారాష్ట్రలోని జల్గామ్ జిల్లా ఫైజాపూర్ వాటర్ ట్యాంక్ ఏరియాలోని రాజు అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి రైలులో తీసుకువచ్చేవాడు. అనంతరం గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లలో కట్టి తన స్నేహితులతో కలిసి కదిరి పరిసర ప్రాంతాల్లో విక్రయించేవాడు. ఒక్కో ప్యాకెట్‌కు రూ. 200 నుంచి రూ. 500 వరకు తీసుకునే వాడు. ఈ క్రమంలోనే ఈ నెల 21న మహారాష్ట్ర నుంచి గంజాయి తెప్పించిన అజాజ్... దాన్ని చిన్నచిన్న ప్యాకెట్లుగా కట్టేందుకు తన ఐదుగురు స్నేహితులతో కలిసి కదిరి మండలం కొండమనాయుని పాళెం గుట్టల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. గంజాయి రవాణా సమాచారం అందడంతో రూరల్ అప్‌గ్రేడ్ పోలీస్‌స్టేషన్ సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్‌ఐ సుమతి ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి గంజాయి తరలిస్తున్న అజాజ్‌తో పాటు అతని స్నేహితులు ఐదుగురిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 10 కిలోల గంజాయి, మూడు బైక్‌లు, ఐదు మొబైల్ ఫోన్లు, రెండు హ్యాండ్ బ్యాగులు, 4 తెల్లసంచులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు.
10 కిలోల గంజాయి, మూడు బైక్‌ల స్వాధీనం