
పింఛన్ కోతలు దుర్మార్గం
పెనుకొండ రూరల్: అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది దాటినా ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోయిందని, పైగా ఇప్పటికే ఉన్న పింఛన్లను రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రీవెరిఫికేషన్ పేరుతో అర్హుల పింఛన్లు తొలగించేందుకు కూటమి సర్కార్ సిద్ధపడిందన్నారు. ఇది ముమ్మాటికీ దుర్మార్గమన్నారు. ప్రభుత్వం అందజేసే సామాజిక పింఛన్లపైనే ఆధారపడి వేలాది మంది దివ్యాంగులు జీవనం సాగిస్తున్నారని, ఇప్పుడు వారి పింఛన్లు అనైతికంగా తొలగిస్తే వారు రోడ్డున పడతారన్నారు. పాలకులు వీలైతే సంపదను సృష్టించి కొత్త పథకాలు అమలు చేసి పేదలకు అండగా నిలవాలిగానీ, ఉన్న పథకాలను నిర్వీర్యం చేయకూడదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అర్హులందరికీ పింఛన్ అందిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయకపోగా, వేలాది మంది అర్హులైన దివ్యాంగులు, అంధుల పింఛన్లు రద్దు చేస్తూ నోటీసులివ్వడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. కడుపుమండిన పింఛన్ లబ్ధిదారులు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆ నోటీసులను ఉపసంహరించుకుని, అర్హులందరికీ పింఛన్ అందేలా చూడాలని ఉషశ్రీచరణ్ కోరారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్