
సోషల్ మీడియాతో సమాజానికి కీడు
అనంతపురం సిటీ: సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) విపరీత ధోరణితో సమాజానికి కీడే ఎక్కువ జరుగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. సంచలనాల పేరుతో నిజాలు నిర్ధారించుకోకుండా ఇష్టమొచ్చినట్లు ప్రచారం, ప్రసారం చేయడం వల్ల ప్రజలు గందరగోళానికి గురవుతున్నారన్నారు. అనంతపురంలోని జిల్లా పరిషత్ క్యాంపస్‌లో ఉన్న డీపీఆర్‌సీ భవన్‌లో శుక్రవారం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) ఉమ్మడి జిల్లా మహాసభ జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర యాదవ్ అధ్యక్షత వహించగా.. యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు రవితేజ, ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి, సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. సమాజానికి ఉపయోగపడే విధంగా కథనాలు ఉండాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జర్నలిస్టుల హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్‌కు చర్యలు తీసుకున్నామన్నారు. అక్రిడిటేషన్ కమిటీల్లో అన్ని సంఘాలకు అవకాశం కల్పిస్తామన్నారు. భవిష్యత్‌లో జర్నలిస్టులకు మరింత చేయూతనందిస్తామని పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు జర్నలిజంతోనే ముడిపడి ఉందని ఉప్పల లక్ష్మణ్ అన్నారు. అయితే చాలా మంది జర్నలిస్టులు అక్రమార్కుల కొమ్ము కాస్తు నిజాలను రాయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నిజాలే రాయాలని, అప్పుడే మెరుగైన సమాజ నిర్మాణంలో మన పాత్ర పోషించిన వారమవుతామని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం విషయంలో తమ యూనియన్ ముందుంటుందని హామీ ఇచ్చారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
సత్యకుమార్