
పారదర్శక పాలనకు కట్టుబడి ఉన్నాం: మంత్రి సవిత
ప్రశాంతి నిలయం: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లాలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. వాడవాడలా స్వాతంత్య్ర వేడుకలు వైభవంగా జరిగాయి. భారత స్వాతంత్య్ర సంగ్రామం, త్యాగధనుల పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నింటిపై జాతీయ జెండాను ఎగురవేశారు.
వైభవంగా స్వాతంత్య్ర వేడుకలు..
పుట్టపర్తి శిరసాని హిల్స్ పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత హాజరయ్యారు. మంత్రికి కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ వి.రత్న, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో పరేడ్‌ను పరిశీలించారు. అనంతరం పోలీసులు, సాయుధ దళాలు, ఎన్‌సీసీ క్యాడెట్లు, పలు పాఠశాలల విద్యార్థులు జాతీయ భావాన్ని చాటుతూ మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. పోలీసు జాగిలాలు మంత్రి సవితకు పుష్పగుచ్ఛం అందజేసి వందనం చేశాయి. జాగిలాలు చేసిన పలు సాహస విన్యాసాలు అహూతులను అబ్బురపరిచాయి. ఏడాది కాలంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని, ప్రజలకు అందించిన సేవలను వివరిస్తూ పలు శాఖలు శకటాలను ప్రదర్శించాయి. అనంతరం ఉత్తమ సేవలందించిన 31 మంది వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులకు సేవా పురస్కారాలు, 251 మంది అధికారులకు ప్రశంసా పత్రాలు మంత్రి సవిత అందజేశారు.
స్టాళ్ల సందర్శన..
వివిధ శాఖల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలను ప్రదర్శిస్తూ ఏర్పాటు చేసిన 11 స్టాళ్లను మంత్రి సవిత, కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌తో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ స్టాల్‌కు మొదటి బహుమతి, అటవీ శాఖ స్టాల్‌కు రెండో బహుమతి, పశుసంవర్ధక శాఖ స్టాల్‌కు మూడో బహుమతిని అందజేశారు. వేడుకల్లో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను మంత్రి సవిత సన్మానించారు.
వాడవాడలా 79వ
స్వాతంత్య్ర దినోత్సవం
పుట్టపర్తిలోని పోలీస్ పరేడ్ మైదానంలో అంబరాన్నంటిన
సంబరాలు
ముఖ్య అతిథిగా హాజరైన
రాష్ట్ర మంత్రి సవిత
దేశభక్తిని చాటిన విద్యార్థుల
సాంస్కృతిక కార్యక్రమాలు
ఉత్తమ సేవలందించిన
అధికారులకు ప్రశంసా
పత్రాల ప్రదానం
అవినీతి రహిత, వివక్ష లేని పారదర్శక పాలనను ప్రజలకు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. శుక్రవారం పుట్టపర్తి శిరసాని హిల్స్‌లోని పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కూటమి సర్కార్ పాలన సాగిస్తోందన్నారు. పీ–4 విధానం ద్వారా పేదరికం లేకుండా రూపుమాపేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం పేద కుటుంబాలను ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం కుటుంబాల సహకారంతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే లక్ష్యంతో ‘సీ్త్ర శక్తి’ పథకాన్ని ప్రారంభించామని, శుక్రవారం నుంచే ఈ పథకం అందుబాటులోకి వచ్చిందన్నారు.
ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలతో పాటు ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఎన్టీఆర్ వైద్య సేవలు ద్వారా పేదలకు లబ్ధి చేకూర్చామన్నారు. ‘దీపం–2.0’ పథకం కింద 3,43,399 కుటుంబాలకు లబ్ధి చేకూర్చామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ చిత్తశుద్ధితో అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

పారదర్శక పాలనకు కట్టుబడి ఉన్నాం: మంత్రి సవిత

పారదర్శక పాలనకు కట్టుబడి ఉన్నాం: మంత్రి సవిత