
గంజాయి విక్రేతల అరెస్టు
● 1,200 గ్రాముల గంజాయి స్వాధీనం
కదిరి టౌన్: గంజాయి విక్రయిస్తున్న పట్టణంలోని నిజాంవలీ కాలనీకి చెందిన షేక్ ఖాజావలీ, ఇరానీ కాలనీ వాసి శియ ఖైబర్ అబ్బాస్‌ను అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. వారి నుంచి 1,200 గ్రాముల గంజాయి, రూ.1,100 నగదు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మునిసిపాలిటీ పరిధిలోని కుటాగుళ్ల రైల్వే గేట్ సమీపంలో కందికుంట నారాయణమ్మ కాలనీ వైపు రస్తా వద్ద కొంతమంది గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో వెళ్లి దాడి చేశామన్నారు. షేక్ ఖాజావలీ, శియ ఖైబర్ పట్టుబడడంతో వారిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచామన్నారు. వారికి న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో కదిరి సబ్ జైలుకు తరలించినట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి దుర్మరణం
పెనుకొండ రూరల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన పెనుకొండ 44వ జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. కియా ఎస్‌ఐ రాజేష్ వివరాల మేరకు.. కళ్యాణదుర్గం రూరల్ మండలంలోని దురదకుంటకు చెందిన కృష్ణమూర్తి (34) బెంగళూరులోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం బెంగళూరు నుంచి కళ్యాణదుర్గానికి ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. పెనుకొండ పరిధిలోని హరిపురం జంక్షన్ సమీపంలోకి రాగానే బైక్ అదుపు తప్పింది. తీవ్రంగా గాయపడిన కృష్ణమూర్తి అనంతపురంలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య సుస్మిత ఉన్నారని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మెరుగైన వైద్యం అందించాలి
హిందూపురం టౌన్: ‘మండల పరిధిలోని మలుగూరు పంచాయతీ నందమూరినగర్‌లోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఒకేసారి 10 మందికిపైగా విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. వారికి వెంటనే మెరుగైన వైద్య సేవలందించాలి’ అని వైఎస్సార్‌ఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు కదిరీష్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బాబావలి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను వారు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో సోమందేపల్లి కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ఘటన మరువకముందే హిందూపురంలో ఒకేసారి పదిమందిపైగా విష జ్వరాలు వచ్చి ఆస్పత్రి పాలవడం బాధాకరమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల ప్రిన్సిపాల్, హౌస్ మాస్టర్‌లను సస్పెండ్ చేయాలన్నారు. అనంతరం డీసీఓ జయలక్ష్మికి వినతిపత్రం అందించారు. జయలక్ష్మి మాట్లాడుతూ ఈ సంఘటన పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
రేపు పుస్తకావిష్కరణ
అనంతపురం కల్చరల్: నగరానికి చెందిన సీనియర్ కవి ఒంటెద్దు రామలింగారెడ్డి రచించిన ‘ఆచారాలు–సంప్రదాయాలు’ పుస్తకాన్ని అరసం (అభ్యుదయ రచయితల సంఘం) ఆధ్వర్యంలో ఈనెల 17న ఆవిష్కరిస్తున్నట్లు సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ తన్నీరు నాగేంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక ఎన్జీఓ హోమ్‌లో జరిగే కార్యక్రమానికి కవులు, రచయితలు హాజరుకావాలని కోరారు.
ఆకట్టుకున్న
‘అమర భారతం’
ప్రశాంతి నిలయం: ప్రశాంతి నిలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు దేశ స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాలను వివరిస్తూ ‘అమర భారతం’ పేరుతో ప్రదర్శించిన నాటిక అందరికీ ఆకట్టుకుంది. స్వాతంత్య్ర సంగ్రామంలో నాటి దేశ నాయకులు కనబరచిన పోరాట పటిమను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సందేశమిచ్చారు.

గంజాయి విక్రేతల అరెస్టు

గంజాయి విక్రేతల అరెస్టు