
జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం
మడకశిర రూరల్: వైఎస్సార్ జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైఎస్సార్‌సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలో మీడియాతో మాట్లాడారు. అధికారం అండతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు రిగ్గింగులు, దొంగ ఓట్లతో ఎన్నికలనే అపహాస్యం చేశారన్నారు. దౌర్జన్యాలు, బెదిరింపులతో స్థానికులను ఓటు వేయకుండా అడ్డుకుని, ఇతర ప్రాంతాల ఓటర్లుతో రిగ్గింగ్ చేసుకుని అదే పెద్ద గెలుపని టీడీపీ నాయకులు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. తనకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే సీఎం చంద్రబాబు.. పులివెందుల, ఒట్టిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో దిగజారుడు రాజకీయం చేశారన్నారు. తమను ఓటు వేయనీయకుండా పోలీసులు అడ్డుకున్నారని... తాము ఓటే వేయకుండా జెడ్పీటీసీలు ఎలా గెలిచారని ఆయా జెడ్పీటీసీ స్థానాల పరిధిలోని ఓటర్లే ప్రశ్నిస్తున్నారన్నారు. టీడీపీ నేతలు ఇతర ప్రాంతాల వారితో దొంగ ఓట్లు వేయిస్తున్నా.. పోలీసులు, అధికారులు కనీసం అడ్డుచెప్పలేదన్నారు. తమకు ఓటు వేయడానికి అవకాశం కల్పించాలని స్థానికులు పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్నా... అవకాశం ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడాన్ని తీవ్రం ఖండించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు నిర్వహించి ఉంటే టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కేవి కావన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న ప్రజాదరణను తగ్గించేందుకు టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ఉపయోగం లేదన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, కూటమి నేతల దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఎన్నోరోజులు సాగవన్నారు. రానున్న రోజుల్లో ఈ దుర్మార్గులకు తప్పకుండా బుద్ధి చెప్పి తీరుతారన్నారు.
రిగ్గింగ్, దొంగ ఓట్లతో గెలిచి సంబరాలు చేసుకుంటారా? టీడీపీ నేతల దిగజారుడు రాజకీయంపై మండిపడిన ఈరలక్కప్ప