
మరీ ఇంత స్వాతంత్య్రమా?
చిలమత్తూరు: రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి టీడీపీ నేతల ఆగడాలకు, దౌర్జన్యాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. తమ ప్రభుత్వంలో తామేం చేసినా చెల్లుతుందన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా చిలమత్తూరుకు చెందిన టీడీపీ నేత సురేంద్ర అత్యుత్సాహం ప్రదర్శించాడు. శుక్రవారం పలగలపల్లి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో గాంధీ చిత్రపటం పక్కనే మరణించిన తన తండ్రి ఫొటో ఉంచాడు. తన తండ్రి పాఠశాలకు స్థలం ఇచ్చారని, తన తండ్రి ఫొటోకు కూడా పూజలు చేయాలని ఆదేశాలిచ్చాడు. దీంతో ఉపాధ్యాయురాలు చేసేది లేక గాంధీజీ చిత్రపటం పక్కనే టీడీపీ నేత తండ్రి ఫొటో ఉంచి పూజలు నిర్వహించారు. దీనిపై ఉపాధ్యాయురాలిని వివరణ కోరగా... ‘‘ఆయన (టీడీపీ నేత) తన తండ్రి ఫొటో కూడా పెట్టాలని ఆదేశించారు..అందుకే తప్పక పెట్టాల్సి వచ్చింది’’ అని సమాధానం ఇచ్చారు. ఈ ఘటనపై ఎంఈఓ –1 హనుమంతరెడ్డి మాట్లాడుతూ... అలా చేయడం ముమ్మాటికీ తప్పేనన్నారు. ఉపాధ్యాయురాలిని విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.
స్వాతంత్య్ర వేడుకల్లో గాంధీ చిత్రం పక్కనే టీడీపీ నేత తండ్రి ఫొటో
దండలు వేసి పూజలు చేయించిన టీడీపీ నేత
పలగలపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఘటన