
మాజీ సైనికులకు ఉచిత న్యాయ సేవలు
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా మాజీ సైనికులకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయసేవలు అందించనున్నట్లు జిల్లా జడ్జి భీమారావు తెలిపారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారి కార్యాలయంలో లీగల్ సర్వీసెస్ క్లినిక్ ఏర్పాటు చేసి ఉచిత న్యాయ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం అనంతపురం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో కోవూరు నగర్‌లోని జిల్లా సైనిక సంక్షేమ అధికారి కార్యాలయంలో లీగల్ సర్వీసెస్ క్లినిక్‌ను జిల్లా జడ్జి ప్రారంభించారు. పెన్షన్, భూ వివాదాలు, కుటుంబ తదితర అన్ని న్యాయ సంబంధిత సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.రాజశేఖర్, జిల్లా సైనిక సంక్షమ అధికారి పి.తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.
ఎస్కేయూలో ‘డిజైన్
థింకింగ్’ కోర్సు ప్రారంభం
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సహకారంతో మూడో వ్యాల్యూ యాడెడ్ కోర్సు ‘డిజైన్ థింకింగ్ సర్టిఫికెట్ కోర్సు’ను ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి.అనిత శుక్రవారం ప్రారంభించారు. నూతన కోర్సు మానవ కేంద్రీకృత డిజైన్ విధానాలను నేర్పిస్తుంది. విద్య, వ్యాపారం, వ్యవసాయం, సహజ అభివృద్ధి వంటి విభిన్న రంగాల్లో వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వినూత్న పరిష్కారాలు అందించే సరళమైన, శక్తివంతమైన పద్ధతులు నేర్చుకోవడానికి ఈ కోర్సు దోహదం చేస్తుంది. కార్యక్రమంలో అటల్ ఇంక్యుబేషన్ కేంద్రం సీఈఓ సి.చంద్రమౌళి, కోఆర్డినేటర్ డాక్టర్ కృష్ణుడు, డాక్టర్ పి.జ్యోతి, బి.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
గురుకుల పాఠశాల తనిఖీ
హిందూపురం: మలుగూరు గురుకుల పాఠశాలను జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం పాఠశాలలో వంటశాల నిర్వహణ, వంటకాల తయారీ, తాగునీటి సదుపాయం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్టల్ గదులు, వంటశాల పరిస్థితి, పరిశుభ్రత పరిశీలించారు. అలాగే డీఎంహెచ్‌ఓ, ఎంపీడీఓ సరస్వతిలకు పలు సూచనలిచ్చారు. తరచూ విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయించాలన్నారు.
రాష్ట్ర హాకీ జట్టుకు ఎంపిక
ధర్మవరం అర్బన్: హాకీ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 22 వరకు పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లో జరగనున్న 15వ జాతీయస్థాయి జూనియర్ హాకీ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ధర్మవరానికి చెందిన షేక్ మహబూబ్ బాషా, వనం నవీన్‌కుమార్ ఎంపికై నట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు బంధనాథం సూర్యప్రకాష్ తెలిపారు. వీరు ఈ ఏడాది ఏప్రిల్‌లో ధర్మవరంలో జరిగిన 15వ రాష్ట్రస్థాయి జూనియర్ హాకీ పోటీలలో జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి మంచి ప్రతిభ చూపడంతో రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారన్నారు. అలాగే రాష్ట్ర హాకీ జట్టుకు కోచ్‌గా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కోచ్ హసేన్ వ్యవహరిస్తున్నారని తెలిపారు.

మాజీ సైనికులకు ఉచిత న్యాయ సేవలు

మాజీ సైనికులకు ఉచిత న్యాయ సేవలు

మాజీ సైనికులకు ఉచిత న్యాయ సేవలు