
దగ్గుపాటి వర్సెస్ వైకుంఠం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆ పార్టీ పరువు బజారున పడినట్టయింది. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మధ్య కొనసాగుతున్న ఈ రాజకీయ వైరం తారస్థాయికి చేరింది. స్వపక్షంలోనే విపక్షం అన్నట్టు కొనసాగుతున్న ఈ ఆరోపణలు చివరకు రచ్చకెక్కాయి. ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలకు దిగి పార్టీ పరువు తీస్తున్నారని తెలుగు ‘తమ్ముళ్లు’ వాపోతున్నారు.
మీలా తాళిబొట్లు తెంచలేదు..
మీలాగా కొంతమంది తాళిబొట్లు తాను తెంచలేదని, ఎవరిమధ్యా గొడవలు పెట్టలేదని ప్రభాకర్ చౌదరిపై ఎమ్మెల్యే దగ్గుపాటి విమర్శలు సంధించారు. ‘నాకు టికెట్ వచ్చినప్పటి నుంచి ఇబ్బందులు పెడుతున్నారు.. చాలా సంతోషం.. నాపై విచారణ చేస్తే క్లీన్‌చిట్ వస్తుంది. నేను కొందరిలాగా చైర్మన్‌గా ఉంటూ ఆస్తులు సంపాదించుకోలేదు, నేను ఇక్కడ స్టాండ్ అవుతాననే ఆందోళనతోనే ఇదంతా చేస్తున్నారు. చివరకు నా బర్త్‌డే రోజు ఫ్లెక్సీలు చూసి ఓర్వలేక పోయారు. గతంలో రహంతుల్లా ఎలా ఓడిపోయారో అందరికీ తెలుసు. మహాలక్ష్మి శ్రీనివాస్‌ను ఎవరు ఓడించారో అందరికీ తెలుసు. గతంలో ఆయన బీ ఫామ్ ఎలా తెచ్చుకున్నారో కూడా తెలుసు’ అని విమర్శించారు.
నీ బండారం బయటపెడతా..
దగ్గుపాటి వ్యాఖ్యలకు ప్రభాకర్ చౌదరి దీటుగా స్పందించారు. ‘ఇప్పుడు బయటపెట్టింది కొన్ని మాత్రమే.. ఇంకా నా దగ్గర చాలా ఆధారాలున్నాయి. మందుతాగి మహిళలతో ఎలా మాట్లాడారో తెలుసు. రాప్తాడు ప్రసాద్‌రెడ్డి హత్యకేసులో ముద్దాయి ఎవరో తెలుసు. రాప్తాడుకు చెందిన వారు నీ ప్రైవేటు సైన్యంగా ఉన్నారు. మైనార్టీ అమ్మాయి షాపు ఆక్రమణలో అక్కడున్నది నీ మనిషి కాదా? అమ్మాయిని ఎలా బెదిరించావో తెలుసు. రాత్రి మందుతాగి తెలుగు యువత నాయకుణ్ని ఎలా మాట్లాడావో తెలుసు. ఇవన్నీ బయటపెడతా. రామాంజనేయులు అనే వ్యక్తికి చెందిన 92 సెంట్ల భూమిని మీరు కబ్జా చేస్తే ఎస్పీకి ఫిర్యాదు చేసింది వాస్తవం కాదా? నీ వ్యవహారం వల్ల ఉమ్మడి జిల్లాలోని 14 నియోజక వర్గాల్లో ప్రభావం పడుతోంది’ అని అన్నారు.
తారస్థాయికి విభేదాలు
పరస్పర ఆరోపణలతో
తగ్గేదేలే అంటున్న నేతలు
బజారునపడ్డ అనంతపురం అర్బన్ టీడీపీ రాజకీయం