నులిపురుగులను నులిమేద్దాం | - | Sakshi
Sakshi News home page

నులిపురుగులను నులిమేద్దాం

Aug 11 2025 7:39 AM | Updated on Aug 11 2025 7:39 AM

నులిప

నులిపురుగులను నులిమేద్దాం

నులిపురుగుల నుంచి

రక్షించుకోండి

నులిపురుగుల నివారణకు అందించే ఆల్బెండజోల్‌ మాత్రలు రాష్ట్రీయ బాల స్వాస్థ్య ఆరోగ్య మిషన్‌ (ఆర్‌బీఎస్‌కే) ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేస్తారు. వీటిని కచ్చితంగా తీసుకొని నులిపురుగుల నుంచి కాపాడుకోవాలి. మల విసర్జన తర్వాత, భోజనం తర్వాత చేతులను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పటికే అన్ని గ్రామాల్లో ఉన్న ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, సిబ్బందికి మాత్రలు అందజేశాం.

– డాక్టర్‌ సునీల్‌, ఆర్‌బీఎస్‌కే జిల్లాఅధికారి

పుట్టపర్తి అర్బన్‌: పిల్లల ఎదుగుదల, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే నులి పురుగులు అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. వీటిని ఒక్క ఆల్బెండజోల్‌ మాత్రతో నివారించవచ్చు. ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఓసారి ఏడాది నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలకు ఈ మాత్రలు పంపిణీ చేస్తోంది. ఈ నెల 12న జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరికీ అందజేయనుంది. నులి పురుగులు చిన్నారుల్లో రక్త హీనతకు దారి తీస్తాయి. శారీరక, మానసిక ఎదుగుదలకు ఆటంకంగా మారుతాయి. కడుపు లోపల చేరి నొప్పి, మంట, వికారం కలగజేస్తాయి. దీనితో ఆహారం సహించదు, ఆకలి ఉండదు, త్వరగా నీరసపడిపోతారు. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. మలంలో రక్తం, అతిసారం వంటి సమస్యలు ప్రబలుతాయి.

నులి పురుగుల సమస్య ఇలా...

వ్యక్తిగత పరిశుభ్రత పాటించని పిల్లలకు నులిపురుగుల సమస్య అధికంగా ఉంటుంది. పిల్లల చేతి గోళ్లలో పేరుకున్న మట్టి ద్వారా నులి పురుగులు కడుపులోకి వెళ్తాయి. కలు షిత ఆహరం, నీరు, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జనతో సైతం నులిపురుగులు కడుపులోకి చేరుతాయి. ప్రతిసారీ భోజనం ముందు చేతులు కడుక్కోకపోవడం, కూరగాయలు కడగకపోవడం, మూతలు లేని ఆహార పదార్థాలను భుజించినా నులిపురుగుల ప్రభావం అధికంగా ఉంటుంది.

నివారణ ఇలా...

నులిపురుగుల నివారణ కోసం ఏడాది నుంచి రెండేళ్లలోపు పిల్లలకు ఆల్బెండజోల్‌ 200 ఎంజీ మాత్ర, 2 – 19 ఏళ్లలోపు పిల్లలకు 400 ఎంజీ మాత్రను ఇచ్చి చప్పిరించేలా చూడాలి. ఇవన్నీ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో కొనసాగిస్తారు. మొదటి రోజు అందుబాటులో లేని వారికి తర్వాత రోజు అందిస్తారు. ఇప్పటికే మాత్రలు, పోస్టర్లను ఆయా సంస్థలకు అందజేశారు. జిల్లాలో 5,420 విద్యా సంస్థ(అంగన్‌వాడీ, పాఠశాలలు, కళాశాల)ల్లో 3,66,225 మంది పిల్లలు ఉన్నారు. ఈ ఆల్బెండజోల్‌ మాత్ర కడుపులో ఉన్న నులిపురుగులు, ఏలిక పాములు, కొంకి పురుగులను నివారిస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఓసారి కచ్చితంగా వీటిని తీసుకోవాలి. ఈ నులిపురుగులు మాత్ర వేసుకున్న ఒకటి రెండు రోజుల్లో మల విసర్జన ద్వారా బయటకు వచ్చేస్తాయి. దీర్ఘ కాలిక రోగులు, ఇతర మందులు వాడుతున్నా వీటిని తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

ఆల్బెండజోల్‌ మాత్రతో చెక్‌ పెట్టొచ్చు

జిల్లాలో 3,66,225 మంది

చిన్నారుల లక్ష్యం

రేపు జాతీయ నులి పురుగుల దినోత్సవం

3.66 లక్షల మందికి అందిస్తాం

జిల్లాలోని 5,420 విద్యాసంస్థల్లో 1 – 19 ఏళ్లలోపు 3.66 లక్షల మంది చిన్నారులు ఉన్నారు. వారందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలు వేస్తాం. ప్రభుత్వం వీటిని ఉచితంగా అందిస్తుంది. ఈ నెల 12న (మంగళవారం) మాత్రలు అందిస్తారు. అందుబాటులో లేని వారికి స్పెషల్‌ డ్రైవ్‌ కింద ఈ నెల 20న పంపిణీ చేస్తారు. ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండి తీసుకోవాలి.

– డాక్టర్‌ ఫైరోజాబేగం, డీఎంహెచ్‌ఓ

నులిపురుగులను నులిమేద్దాం1
1/1

నులిపురుగులను నులిమేద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement