
‘రెడ్‌బుక్’తో అరాచక పాలన
సోమందేపల్లి: కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగం మాటున అరాచక పాలన సాగిస్తోందని, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులే లక్ష్యంగా ముందుకు సాగుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. సోమందేపల్లి మండలం వెలిదడకల గ్రామంలో ఆదివారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కేబినెట్ మంత్రులంతా అక్కడే తిష్టవేసి అరాచకాలకు తెరలేపారని మండిపడ్డారు. వైఎస్సార్ కుటుంబం పులివెందులలో అరాచకాలకు పాల్పడుతోందని మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలను ఉషశ్రీచరణ్ తప్పుపట్టారు. ముందు పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో టీడీపీ గూండాలు చేసిన దాడి గురించి మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. కూటమి నాయకులకు వత్తాసు పలుకుతు ఏకపక్షంగా అమాయకులపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో అక్కడక్కడా టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం లేదన్నారు. జనసేనను ఆయన టీడీపీకి తాకట్టు పెట్టేశారని ఎద్దేవా చేశారు. పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కచ్చితంగా గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రజల హృదయాల్లో వైఎస్సార్ కుటుంబంపై ఉన్న అభిమానాన్ని ఎవ్వరూ చెరిపేయలేరన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ గజేంద్ర, జెడ్పీటీసీ అశోక్, మాజీ కన్వీనర్ నారాయణరెడ్డి, సర్పంచ్‌లు అంజీనాయక్, కిష్టప్ప, సోము, డీలర్ రామాంజి, కోఆప్షన్ సభ్యుడు రఫిక్, నాయకులు వేణు, నాయకులు కంబాలప్ప, ఆదినారాయణరెడ్డి, హనుమంతరెడ్డి, నరసింహమూర్తి, వైస్ ఎంపీపీ వెంకటనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కియాలో టీడీపీ గూండాల దాడిపై
మంత్రి సవిత స్పందించాలి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్