
ఆదివాసీలు సమాజానికే ఆదర్శం
● జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్
గోరంట్ల: సంప్రదాయాలను కాపాడుకుంటూ జీవనం సాగించే ఆదివాసీలు సమాజానికి ఆదర్శమని జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ అన్నారు. ఆదివాసీల అరుదైన సంప్రదాయాలను రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. శనివారం గోరంట్ల ప్రభుత్వ గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ మాట్లాడుతూ... ఆదివాసీలు ప్రకృతితో కలిసి జీవనం సాగిస్తారన్నారు. ఆదివాసీల భాష, సంప్రదాయ నృత్యం, వ్యవసాయ పద్ధతులు వంటి వాటిని రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్వాతంత్య్ర సమరంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి వీరులు గిరిజనులేనని జేసీ గుర్తు చేశారు. అందువల్లే మిగతా వర్గాలతో సమానంగా గిరిజనులు కూడా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. జిల్లాలోని గిరిజన హాస్టళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పాటు సీఎస్సార్ ఫండ్స్ కూడా కేటాయించి ఆయా వసతి గృహాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యుడు సోమ్లా నాయక్, అర్బన్ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కాలే నాయక్, జిల్లా విజిలెన్స్ మానటరింగ్ కమిటీ మెంబర్ శ్రీనివాసులు నాయక్, డివిజన్ విజిలెన్స్ మానిటరీ కమిటీ మెంబర్ ఉమాశంకర్, గిరిజన సంక్షేమ మండలి సభ్యుడు హరిలాల్ నాయక్ పాల్గొని ప్రసంగించారు.
సాయి కీర్తి.. సాంస్కృతిక దీప్తి
● ప్రశాంతి నిలయంలో తెలంగాణ భక్తుల సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రశాంతి నిలయం: సత్యసాయి కీర్తిని వివరిస్తూ తెలంగాణ భక్తులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తకోటిని ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్లాయి. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటుతూ చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన తెలంగాణ సత్యసాయి భక్తులు శనివారం సత్యసాయి సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సత్యసాయి సూక్తులు, బోధనలను వివరిస్తూ ‘పద్య సూక్తులు’ పేరుతో నృత్యరూపకం నిర్వహించారు. చక్కటి నృత్య భంగిమలతో భక్తులను ఆకట్టుకున్నారు. సాయంత్రం ‘దివ్య ప్రణాళిక’ పేరుతో ఆధ్యాత్మిక భక్తిరస నాటిక నిర్వహించారు. సత్యసాయి జీవిత చరిత్ర, బోధనలు, సేవా కార్యక్రమాలు తదితర అంశాలను ప్రస్తావిస్తూ నిర్వహించిన నాటిక భక్తుల మదిని మురిపించింది.
నెట్టికంటుడి సేవలో
ఉప లోకాయుక్త
గుంతకల్లు రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప లోకాయుక్త పి.రజని శనివారం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు. ఆమెకు అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు ఉప లోకాయుక్త రజనికి స్వామివారి తీర్థప్రసాదాలు, పట్టు వస్త్రాలు అందజేశారు.

ఆదివాసీలు సమాజానికే ఆదర్శం

ఆదివాసీలు సమాజానికే ఆదర్శం

ఆదివాసీలు సమాజానికే ఆదర్శం