
కరెంటు కోసం రోడ్డెక్కిన రైతన్న
ఓడీచెరువు (అమడగూరు): ఖరీఫ్ పంటలు ఎండముఖం పట్టాయి. బోర్ల కింద ఉన్న పంటలైనా చేతికందుతాయనుకుంటే నిత్యం విద్యుత్‌తో సమస్య. దీంతో బోర్లు సరిగా పనిచేయక కళ్లముందే పంటలు ఎండిపోతున్నాయి. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. శనివారం అమడగూరు మండల పరిధిలోని మహమ్మదాబాద్ మూడు రోడ్ల కూడలిలో ధర్నా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మిగతా పార్టీల నేతలూ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ జయప్ప మాట్లాడుతూ.. ప్రకృతికి ఎదురొడ్డి రైతులు పంటలు పండిస్తుంటే...విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న లైన్‌మెన్ ఎప్పుడూ అందుబాటులో లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడన్నారు. ఇక కొత్తగా బోర్లు వేసిన రైతులు ట్రాన్స్‌ఫార్మర్ల కోసం దరఖాస్తు చేసి డబ్బులు కట్టి నెలలు గడుస్తున్నా.. మంజూరు చేయడం లేదన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో నిరాహార దీక్ష చేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న కదిరి ట్రాన్స్‌కో ఏడీ ఓబులేసు అక్కడికి చేరుకుని రైతులతో చర్చించారు. సమస్యకు సత్వర పరిష్కారం చూపిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళన

కరెంటు కోసం రోడ్డెక్కిన రైతన్న