
పట్టు పరిశ్రమకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. పట్టు రైత
హిందూపురం మార్కెట్‌లో విక్రయానికి
తీసుకువచ్చిన బైవోల్టిన్ పట్టుగూళ్లు (ఫైల్)
మడకశిర: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పట్టు రైతులకు ప్రోత్సాహక ధనం అందడం లేదు. ప్రభుత్వ పట్టు మార్కెట్లలో అమ్మిన బైవోల్టిన్ పట్టుగూళ్లు ప్రతి కిలోకు రూ.10 చొప్పున ప్రోత్సాహక ధనం అందాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పట్టు రైతులకు పైసా కూడా ప్రోత్సాహక ధనం అందలేదు. పట్టు రైతులను ఆదుకోవాలని, ప్రోత్సాహక ధనం అందించాలంటూ పట్టు రైతులు పలుమార్లు విజయవాడకు వెళ్లి ధర్నాలు చేపట్టారు. అయినా ప్రభుత్వంలో చలనం రాలేదు. రూ.కోట్లల్లో ప్రోత్సాహక ధనం బకాయిలు పేరుకుపోవడంతో పట్టు రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కరుణించిన ‘మార్కెట్’
పట్టు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్ధయగా వ్యవహరిస్తూ వచ్చినా... అత్యవసర సమయంలో మార్కెట్ కరుణించింది. దీంతో పంట సాగుకు చేసిన అప్పుల భారం నుంచి బయటపడతామనే ధైర్యం పట్టు రైతుల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో బైవోల్టిన్ పట్టుగూళ్ల ధరలు పెరిగాయి. హిందూపురంలోని ప్రభుత్వ పట్టు గూళ్ల మార్కెట్‌లో ఈ నెల 6 నుంచి బైవోల్టిన్ పట్టుగూళ్ల ధర కిలో రూ.700 పైగా పలుకుతోంది. దీంతో జిల్లాలోని పట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. గత మూడు నెలల్లో ఎన్నడూ రూ.700 మార్క్‌ను దాటలేదు. దీంతో నష్టాలు చవిచూడాల్సి వస్తోందని అప్పట్లో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కర్ణాటక మార్కెట్‌లోనూ ఆశాజనక ధరలు
కర్ణాటక మార్కెట్‌లోనూ పట్టుగూళ్ల ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. కర్ణాటక ప్రాంతంలో రామనగర, శిడ్లగట్ట, చింతామణిలోని పట్టు గూళ్ల మార్కెట్లు ప్రధానమైనవి. జిల్లాలో గిట్టుబాటు ధరలేని సమయంలో సరిహద్దున ఉన్న మడకశిర, హిందూపురం, పెనుకొండ నియోజకవర్గాలోని పలువురు రైతులు తమ పట్టు గూళ్లను కర్ణాటకలోని మార్కెట్‌లకు తరలించేవారు. ప్రస్తుతం కర్ణాటక మార్కెట్‌లోనూ కిలో పట్టుగూళ్ల ధర రూ.700 మార్క్ దాటింది. ముఖ్యంగా రామనగర మార్కెట్‌లో ఈ నెల 6న కిలో పట్టు గూళ్లు రూ.811 ధర పలకడం విశేషం.
పెరిగిన పట్టుగూళ్ల ఉత్పత్తి
కొన్ని రోజులుగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా జిల్లాలో పట్టుగూళ్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. హిందూపురం మార్కెట్‌కు ఈ నెల 6న 2,431 కిలోలు, 7న 2,112 కిలోలు, 8న 3,641 కిలోల బైవోల్టిన్ పట్టుగూళ్లను విక్రయానికి రైతులు తీసుకెళ్లారు. అలాగే కర్ణాటకలోని రామనగర మార్కెట్‌కూ భారీగా బైవోల్టిన్ పట్టుగూళ్లు చేరుతున్నాయి. అమ్మకానికి ఈ నెల 6న 22,173 కిలోలు, 7న 29,913 కిలోలు, 8న 24,590 కిలోల బైవోల్టిన్ పట్టుగూళ్లు అమ్మకానికి వచ్చినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
పట్టు రైతులకు అందని ప్రోత్సాహకం
అత్యవసర సమయంలో ఆదుకున్న మార్కెట్
రూ.700 దాటిన కిలో బైవోల్టిన్
పట్టు గూళ్ల ధర
మూడు రోజులుగా ధరల నిలకడ

పట్టు పరిశ్రమకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. పట్టు రైత