
ఓట్ల గల్లంతు వెనుక ఎన్డీఏ హస్తం
ధర్మవరం: బిహార్‌లో ఓట్ల గల్లంతు వెనుక కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ హస్తముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ అన్నారు. ఓట్ల గల్లంతు విషయంగా ధర్మవరంలోని కళాజ్యోతి సర్కిల్‌లో శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బిహార్‌లో ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో దాదాపు 80 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయని, ఇందులో ఎక్కువగా బడుగు బలహీన వర్గాలు, బీసీలు, మైనార్టీలు, వలస వెళ్లిన ప్రజలు ఉన్నారన్నారు. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఓట్లు నమోదవుతాయనే అనుమానంతోనే అర్హులైన ఓటర్లను సైతం జాబితా నుంచి తొలగించారని విమర్శించారు. తొలగించిన ఓటర్లకు సంబంధించిన వివరాలను అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా ఎన్నికల కమిషన్ స్పందించకుండా సమయం సరిపోదని తెలపడం వెనుక పూర్తిగా అధికార పార్టీ హస్తముందనేది స్పష్టమవుతోందన్నారు. ఇలాంటి విధానాలను ఎన్డీఏ ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. నిరసనలో సీపీఎం నాయకులు జంగాలపల్లి పెద్దన్న, వెంకటేష్, శ్రీనివాసులు, దిల్షాద్, లక్ష్మీనారాయణ, మారుతి, సీఐటీయూ నాయకులు జేవీ రమణ, ఎల్.ఆదినారాయణ, వెంకటస్వామి, మున్సిపల్ పారిశుధ్య కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు
రాంభూపాల్