
వరి నాట్లు వేసి నిరసన
ఓడీచెరువు: మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వర్షపు నీటితో మడులను తలపిస్తున్నాయంటూ వరి నాట్లు వేసి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ (ఆర్‌సీపీ) ఆధ్వర్యంలో శుక్రవారం వినూత్న నిరసన తెలిపారు. ప్రధాన రహదారిపై వైఎస్సార్ కూడలి నుంచి అంబేడ్కర్ కూడలి వరకూ రహదారి మొత్తం గుంతలమయమై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచింది. పాదచారులు, ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదంటూ ఈ సందర్భంగా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఏడాదిగా ఇదే పరిస్థితి ఉందని, ఇప్పటికై నా అధికారులు స్పందించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్‌సీపీ పుట్టపర్తి డివిజన్ కార్యదర్శి మున్నా, రైతు సంఘం నాయకులు రామచంద్ర, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.