కమీషన్ల వల.. విలవిల | - | Sakshi
Sakshi News home page

కమీషన్ల వల.. విలవిల

Aug 8 2025 7:05 AM | Updated on Aug 8 2025 2:57 PM

bring the commission money

కమీషన్‌ డబ్బు తీసుకొచ్చారా..

కాంట్రాక్టర్లకు ‘గుడ్డు’కాలం

మార్చి నుంచి నయాపైసా చెల్లించని సర్కారు

బిల్లులు రాకున్నా కమీషన్‌ ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యేల పట్టు

అల్లాడిపోతున్న కాంట్రాక్టర్లు

ఇప్పటికే కోడిగుడ్ల రవాణా పనులు మొత్తం ఎమ్మెల్యేల అనుచరులకే

బిల్లులతో సంబంధం లేదు. కష్టాలు పడుతున్నా పట్టడం లేదు. కమీషన్లు ముట్టజెప్పాకే మాటలు. లేదంటే కష్టాలే. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీ సెంటర్లకు గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రజా ప్రతినిధుల కమీషన్ల వలలో చిక్కుకుని కాంట్రాక్టర్లు అల్లాడిపోతున్నారు.  

సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూటమి ప్రజాప్రతినిధుల దెబ్బకు చిన్న చిన్న సివిల్‌ కాంట్రాక్టర్లు, బిల్డర్లే కాదు అంగన్‌వాడీలకు కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లు సైతం విలవిలలాడుతున్నారు. ‘కోడి ముందా..గుడ్డు ముందా’ అనే చిక్కు ప్రశ్నను మరపిస్తూ ‘గుడ్డు కాదు.. దుడ్డే ముందు’ అన్న విధంగా పరిస్థితి తయారైంది. ‘మీకు బిల్లులు ఎప్పుడైనా రానీ.. మాకు కమీషన్‌ మాత్రం ముందే ఇవ్వాల్సిందే’ అంటూ పట్టుబడుతుండడంతో కొన్ని నియోజకవర్గాల్లో కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు అడిగినంత సమర్పించుకుంటున్న పరిస్థితి.

రవాణా పనులు తమ్ముళ్లకే..

గతంలో కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లే అంగన్‌వాడీలకు వాటిని రవాణా చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని నియోజకవర్గాల్లో కోడిగుడ్ల రవాణా పనులను ఎమ్మెల్యే చెప్పిన వారికి ఇచ్చారు. రవాణాకు సంబంధించిన చెల్లింపులు కాంట్రాక్టరు చేస్తారు. కాంట్రాక్టర్‌కు సమయానికి బిల్లులు వచ్చినా రాకపోయినా ‘తమ్ముళ్ల’కు మాత్రం రవాణా ఛార్జీలు ఇవ్వాల్సిందే. లేదంటే ఎమ్మెల్యే నుంచి ఫోన్‌ వస్తుంది. ఒక్కోసారి రవాణా సమయంలో కోడిగుడ్లు దెబ్బతిన్నా కాంట్రాక్టరే ఆ భారం మోయాల్సి వస్తోంది.

ఆరు మాసాలుగా బిల్లుల్లేవ్‌..

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆరు మాసాలుగా కోడిగుడ్ల సరఫరాకు సంబంధించి బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలో నెలకు 50 లక్షల నుంచి 60 లక్షల గుడ్లు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుత రేట్ల ప్రకారం ఒక్కో కోడిగుడ్డు రూ.6 పైనే పలుకు తోంది. ఈ లెక్కన నెలకు రూ.3.50 కోట్ల వరకూ బిల్లు అవుతుంది. అయితే, రెండు జిల్లాల్లో అంగన్‌వాడీలకు సరఫరా చేసే గుడ్లకు పైసా బిల్లు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు తమ కమీషన్లు ఏడాది ముందే లాగేసుకున్నారు. ఇప్పుడేమో కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.

అంతా ఆయన ఇష్టం..

కదిరి నియోజకవర్గంలో కోడిగుడ్ల సరఫరా కు సంబంధించి ప్రత్యేక రాజ్యం నడుస్తోంది. ఇక్కడ గుడ్లు సరఫరా చేయాల్సిన కాంట్రాక్టర్‌కు స్థానిక ప్రజాప్రతినిధి చుక్కలు చూపుతున్నారు. తనకే కాంట్రాక్టు ఇవ్వాలని భయపెట్టడంతో కాంట్రాక్టర్‌ చేసేదిలేక వదిలేశారు. అంతకుముందు కాంట్రాక్టుకు సంబంధించిన డిపాజిట్‌ డబ్బు కాంట్రాక్టరే బ్యాంకులో చెల్లించినా చిల్లిగవ్వ ఇవ్వలేదు. దీంతో గుడ్ల కొనుగోలు, రవాణా మొత్తం ప్రజాప్రతినిధి చేతుల్లో జరుగుతోంది.దీంతోఅక్కడ గుడ్లు చిన్నవా, పెద్దవా అని అడిగే సాహసం చేసేవారు లేరు.

అనంతపురం జిల్లాలో అంగన్‌వాడీ సెంటర్లు ; 2,302 

శ్రీ సత్యసాయి జిల్లాలో అంగన్‌వాడీ సెంటర్లు; 2,824 

నెలకు సగటున కోడిగుడ్ల బిల్లు; రూ. 3.50 కోట్లు

నెలకు అవసరమయ్యే కోడిగుడ్లు; 50-60 లక్షలు

ఆరునెలల బకాయిలు; రూ. 21కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement