స్వయం ఉపాధి పొందేదెన్నడు?
● బీసీ కార్పొరేషన్ రుణాల కోసం అభ్యర్థుల నిరీక్షణ
అనంతపురం రూరల్: వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం (బీసీ కార్పొరేషన్) అందించే సబ్సిడీ రుణాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి కానీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత నుంచి కానీ ఎటువంటి సమాచారమూ అందకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం బీసీల సంక్షేమం, వారి అభ్యున్నతి కోసం ఎంతో చేస్తున్నామని చెబుతున్నా ఆచరణలో అవేమీ కనిపించడం లేదన్న విమర్శలున్నాయి. గత వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రతి పథకంలోనూ బీసీలకు సముచిత న్యాయం జరిగింది. ఆయా సంక్షేమ పథకాల లబ్ధిని ఠంచన్‌గా అందుకున్న సంగతి తెలిసిందే. బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలకు ఐదు నెలల కిందట నోటిఫికేషన్ వచ్చింది. ఈ మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3,220 యూనిట్లకు 33,129 మంది బీసీ కులాల వారు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అనంతపురం జిల్లాలో 1,728 యూనిట్లకు గాను 19,098 మంది, శ్రీ సత్యసాయి జిల్లాలో 1,492 యూనిట్లకు 14,031 మంది దరఖాస్తు చేసుకోగా.. అధికారులు ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపిక.. రుణాల మంజూరు సమాచారం ఏదీ తెలియడం లేదని అభ్యర్థులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి రుణాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఉత్తర్వులు రాగానే రుణాలిస్తాం
బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాల కోసం నిరుద్యోగ యువత చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్వ్యూలు పూర్తి చేశాం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే లబ్ధిదారులకు సమాచారం అందించి రుణాలు అందజేస్తాం. – సుబ్రహ్మణ్యం, ఈడీ, బీసీ కార్పొరేషన్


