యోగాతోనే శారీరక, మానసిక ఆరోగ్యం
పుట్టపర్తి టౌన్: యోగాతోనే శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవచ్చని కలెక్టర్ చేతన్, ఎస్పీ పేర్కొన్నారు. బుధవారం ఉదయం పుట్టపర్తిలో విద్యాగిరి రోడ్డుపై పర్యాటక యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అన్ని శాఖల అధికారులు, స్వచ్ఛంద సేవాసంస్థల ప్రతినిధులతో పాటు పట్టణ ప్రజలు దాదాపు రెండు వేల మందితో కలిసి యోగాసనాలు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించాలని లక్ష్యం పెట్టుకొందని అందులో భాగంగా జిల్లాలో రెండు చోట్ల యోగాసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగా సాధన చేస్తే వివిధ రకాల వృత్తులు, ఉద్యోగాలు వ్యాపారాల్లో మరింత నైపుణ్యత సాధిస్తారని తెలిపారు. చిన్న వయసు నుంచే యోగా చేస్తే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగి విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. అనంతరం యోగా గురువును సత్కరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చేతన్, ఆర్డీఓ సువర్ణ, డీఎస్పీ విజయకుమార్, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, క్రీడాభివృద్ధి అధికారి ఉదయభాస్కర్, డ్వామా పీడీ విజయానంద్, డీఎంహెచ్‌ఓ ఫైరోజాబేగం, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగప్రసాద్, బీసీ సంక్షేమశాఖ అధికారి నిర్మలాజ్యోతి, మున్సిపల్ కమిషనర్ క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.
యోగాసనాలు వేస్తున్న కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న తదితరులు


