జూన్‌లో గృహ ప్రవేశాలు లేనట్టే!
కదిరి అర్బన్: టిడ్కో గృహనిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హామీతో జూన్‌లో గృహప్రవేశాలు చేయొచ్చని లబ్ధిదారులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. 2017లో కదిరి మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డులకు చెందిన దాదాపు 3వేల మంది పేదలకు కదిరి– హిందూపురం రోడ్డు పక్కన టిడ్కో ఇళ్లు మంజూరు చేశారు. ప్రస్తుతం 75 శాతం పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో మిగిలిన 25 శాతం పనులు పూర్తి చేసి పేదలకు అందిస్తామని చెప్పారు. ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో ఏడేళ్లుగా ఈ భవనాలు పాడుబడిపోయాయి. గృహాలకు సంబంధించిన మెటీరియల్ చాలావరకు చోరీకి గురయింది.
పనులు పూర్తయ్యేదెన్నడో..?
పట్టణ శివారులోని కదిరి– హిందూపురం రహదారికి ఆనుకుని 40 ఎకరాల విస్తీర్ణంలో టిడ్కో గృహ సముదాయాల నిర్మాణం జరుగుతోంది. 75 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా భవనాల్లో విద్యుత్, ఉడ్ వర్క్, పెయింటింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. వీధిలైట్లు, డ్రెయినేజీ, అంతర్గత రోడ్డు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఎనిమిదేళ్లయినా పనులు పూర్తి కాకపోవడంతో ఆ ప్రాంతం పిచ్చిమొక్కలతో అడవిని తలపిస్తోంది. భవనాలు విషసర్పాలకు ఆవాసంగా మారిపోయాయి.
పూర్తి కాని టిడ్కో ఇళ్ల నిర్మాణం
మౌలిక సదుపాయాలూ నిల్
సొంతింటి కల మరింత ఆలస్యం
మరింత సమయం పట్టొచ్చు
ప్రస్తుతానికి టిడ్కో ఇళ్ల నిర్మాణాలపై మాకు ఎలాంటి సమాచారమూ లేదు. 75 శాతం పూర్తయిన ఇళ్లను మిగిలిన 25 శాతం ఈ ఏడాది జూన్‌కు ఒక ఫేజ్, అక్టోబర్‌కు 2వ ఫేజ్‌లో పూర్తి చేసి ఇవ్వాలని గతేడాది రాష్ట్ర పురపాలక శాఖామంత్రి నారాయణ మున్సిపల్ కమీషనర్‌లతో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. ఇవి ఫైనల్ స్టేజ్‌లో ఉన్న భవనాలకు మాత్రమే. ఫైనల్ స్టేజ్ జాబితాలో కదిరి లేదు. ఇంకా సమయం పట్టచ్చు.
– కిరణ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్, కదిరి
త్వరగా గృహాలు అప్పగించాలి
టిడ్కో ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందివ్వాలి. ఇళ్ల నిర్మాణాల పూర్తి కోసం సీపీఎం ఆద్వర్యంలో అనేక ఆందోళనలు చేపట్టాం. అయినా పనుల్లో వేగం లేదు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి గృహనిర్మాణాలు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేటాయించాలి.
– నరసింహులు,
సీపీఎం పట్టణ కార్యదర్శి
జూన్‌లో గృహ ప్రవేశాలు లేనట్టే!
జూన్‌లో గృహ ప్రవేశాలు లేనట్టే!


