కఠిన చర్యలు తీసుకుంటాం | - | Sakshi
Sakshi News home page

కఠిన చర్యలు తీసుకుంటాం

May 26 2025 1:40 AM | Updated on May 26 2025 1:40 AM

కఠిన చర్యలు తీసుకుంటాం

కఠిన చర్యలు తీసుకుంటాం

సాక్షి, పుట్టపర్తి కొందరు తల్లిదండ్రులు ఆడపిల్లను భారంగా భావిస్తున్నారు. పుట్టేది ఆడపిల్ల అని తెలిస్తే కడుపులోనే కడతేరుస్తున్నారు. వారసత్వం అంటే కేవలం మగబిడ్డ అనే నమ్మకంలో చాలామంది ఉండటం దౌర్భాగ్యం. దీన్ని ఆసరా చేసుకుని ల్యాబ్‌ నిర్వాహకులు అధిక ఆదాయం కోసం లింగ నిర్ధారణను గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారు. జిల్లాలో చాలా ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ చేస్తున్నట్లు సమాచారం. ఆయా డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి.. టెక్నీషియన్ల అర్హతలు, బాధితుల నుంచి నమూనాలు సేకరిస్తున్న తీరు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, రిపోర్టుల జారీ వంటి అంశాలను పరిశీలించాల్సిన వైద్య ఆరోగ్య శాఖాధికారులు పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో లింగ నిర్ధారణ యథేచ్ఛగా సాగుతోంది.

రెన్యూవల్స్‌ కోసం కూడా వెళ్లకుండా..

ప్రైవేటు ఆస్పత్రులు ప్రతి ఐదేళ్లకు ఓసారి అనుమతులు రెన్యూవల్స్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే అడిగేవారు లేకపోవడంతో పదేళ్లు అయిన ఆస్పత్రులు కూడా అనుమతులకు దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం. ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేసే వైద్యుల్లో చాలామంది ప్రభుత్వ జీతం తీసుకునే వారే కావడం విశేషం. డ్యూటీ సమయంలో ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి.. అక్కడి నుంచి రోగులను తెచ్చుకుని ప్రైవేటుగా వైద్యం చేసి డబ్బులు గుంజుతున్న సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అర్హతలు మరచి..

ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేసే టెక్నీషియన్లు, ల్యాబ్‌ నిర్వాహకులు చాలామంది అర్హత లేనివారే. వారిచ్చే తెలిసీ తెలియని రిపోర్టు ఆధారంగా రోగులకు డాక్టర్‌ మందులు (ఔషధాలు) రాసిస్తారు. వాటిని వాడిన తర్వాత రోగులకు కొత్త అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఫలితంగా అదే డాక్టర్‌ వద్దకు వెళ్లినా.. గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. అబార్షన్‌ చేయించుకున్న తర్వాత చాలామంది అనారోగ్యం బారిన పడిన దాఖలాలు ఉన్నాయి.

కోడ్‌ భాష ద్వారా..

పుట్టబోయే బిడ్డ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు డాక్టర్లు స్కానింగ్‌ చేస్తారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ చేసి వివరాలు రహస్యంగా వెల్లడిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘కోడ్‌’ భాష వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఆడబిడ్డ అయితే శుక్రవారం, మగబిడ్డ అయితే సోమవారం అనే భాషలో మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం.

అటకెక్కిన పీఎన్‌డీటీ చట్టం

పీఎన్‌డీటీ (ప్రీ–నాటల్‌ డయాగ్నస్టిక్స్‌ టెక్నిక్స్‌) – చట్టం– 1994ను అటకెక్కించారు. లింగ నిర్ధారణ చేస్తే చట్టం ప్రకారం రూ.50 వేల జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. కడుపులోని బిడ్డ ఆరోగ్యం గురించి.. జన్యుపరమైన విషయాలను మాత్రమే వెల్లడించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడ, మగ అనే విషయాలు వెల్లడించరాదు. లింగ నిర్ధారణ చేసే కేంద్రాల గురించి సమాచారం ఎవరు ఇచ్చినా.. వారి పేర్లు గోప్యంగా ఉంచి.. దాడులు చేసి జరిమానాతో పాటు కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది.

విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు

అధికారుల పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యం

కాసుల కోసం ల్యాబ్‌ నిర్వాహకుల కక్కుర్తి

ఆడపిల్ల అంటే.. ఆలస్యం లేకుండా అబార్షన్‌!

జిల్లాలో 190 ల్యాబ్‌లకు అనుమతులు ఉన్నాయి. అయితే ఎక్కడా లింగ నిర్ధారణ చేయరాదు. గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ చేసే ఆస్పత్రుల వివరాలు చెబితే తనిఖీలు చేసి కేసుల నమోదుకు సిఫారసు చేస్తాం. లింగ నిర్ధారణ నేరం. ఎవరూ చేయించుకోకూడదు. గర్భం దాల్చిన మహిళ కూడా ముందు ఆడబిడ్డ అనే విషయం గుర్తుంచుకోవాలి. భ్రూణ హత్యలు చేయరాదు. అలాంటి ల్యాబ్‌లను తప్పకుండా సీజ్‌ చేస్తాం.

– ఫైరోజాబేగం,

జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, పుట్టపర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement