
ఈ–కేవైసీ పూర్తయ్యేదెన్నడో ?
ప్రశాంతి నిలయం: రేషన్‌కార్డులో సభ్యులుగా ఉన్న లబ్ధిదారులందరూ ఈ–కేవైసీ పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. గత ఐదు నెలలుగా ఈ–కేవైసీ పూర్తి చేసే ప్రక్రియ క్షేత్రస్థాయిలో జరుగుతోంది. రేషన్ లబ్ధిదారులు ఈ–కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ సరుకులు ఇచ్చే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. గడువును కూడా జూన్ 30 వరకూ పొడిగించారు. అయితే జిల్లాలో ఇప్పటికీ 99,872 మంది లబ్ధిదారులు ఇంకా ఈ– కేవైసీ చేయించుకోలేదు.
వందశాతం కష్టమే..
జిల్లాలో 5,66,971 రేషన్ కార్డులు ఉండగా 16,89,531 మంది సభ్యులుగా ఉన్నారు. వీరందరితో ఈ–కేవైసీ పూర్తి చేయాలని పౌరసరఫరాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికీ 99,872 మంది లబ్ధిదారులు ఈ–కేవైసీ పూర్తి చేయలేదు. గడువులోపు ఈ–కేవైసీ పూర్తి చేసుకోకపోతే రేషన్ సరుకులు అందించబోమని ప్రభుత్వం చెబుతోంది. వలస వెళ్లిన వారు, ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి ఈ–కేవైసీపై అవగాహన లేకపోవడంతో ఇబ్బంది వస్తోంది. గడువులోపు పూర్తిచేయకపోతే వారంతా నష్టపోయే ప్రమాదం ఉంది. జిల్లాలో వంద శాతం ఈ–కేవైసీ పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదన్న విమర్శలున్నాయి.
వలంటీర్ వ్యవస్థ లేకపోవడంతోనే ..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ వలంటీర్ వ్యవస్థ చురుగ్గా పనిచేసేది. క్షేత్రస్థాయిలో ఏపనైనా సకాలంలో వలంటీర్లు పూర్తి చేసే వారు. అయితే ఇప్పడు కూటమి ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం క్షేత్రస్థాయిలో సర్వేలు సహా ఏ ఇతర పనులు కూడా సక్రమంగా జరగడం లేదన్న విమర్శలున్నాయి. వలంటీర్లు లేకపోవడంతో ఈ–కేవైసీని రేషన్ డీలర్లకు అప్పగించారు. వారు పూర్తిస్థాయిలో దృష్టిసారించకపోవడంతో ఈ–కేవైసీ పూర్తిచేయని వారి సంఖ్య అధికంగా ఉందంటున్నారు.
నేటికీ వివరాలు నమోదు చేయని
99,872 మంది లబ్ధిదారులు
జూన్ 30 వరకూ గడువు
గడువులోగా పూర్తి చేస్తాం
రేషన్ లబ్ధిదారులు ఈ–కేవైసీ పూర్తి చేసేందుకు జూన్ 30 వరకూ గడువు ఉంది. క్షేత్రస్థాయిలో రేషన్ డీలర్ల ద్వారా గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేయించేందుకు కృషి చేస్తాం. లబ్ధిదారులు కూడా ఈ–కేవైసీ పూర్తి చేయించుకునేందుకు సహకరించాలి. సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా రేషన్ కార్డు ఉన్న ప్రాంతానికి వచ్చి ఈ–కేవైసీ చేయించుకోవాలి.
– వంశీకృష్ణారెడ్డి,
జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి

ఈ–కేవైసీ పూర్తయ్యేదెన్నడో ?

ఈ–కేవైసీ పూర్తయ్యేదెన్నడో ?