
తప్పుల్లేని ఓటరు జాబితానే లక్ష్యం
ప్రశాంతి నిలయం: ‘తప్పుల్లేని ఓటరు జాబితాను తయారు చేయడమే లక్ష్యం. దీనికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి’ అని డీఆర్‌ఓ విజయసారథి కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాల్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో తప్పులు లేని ఓటరు జాబితా, పోలింగ్ శాతం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఓటరు నమోదు తదితర అంశాలపై సమీక్షించారు. డీఆర్‌ఓ మాట్లాడుతూ ఓటరు జాబితాలో పేరు నమోదు, తొలగింపు, సవరణ, ఇతర క్లెయిమ్‌లకు సంబంధించిన అంశాలపై చేసిన దరఖాస్తుల స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశాన్ని భారత ఎన్నికల కమిషన్ కల్పించిందన్నారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్, ఓటర్ల రేషనలైజేషన్ ప్రక్రియలో రాజకీయ పార్టీలు భాగస్వాములు కావాలన్నారు. పోలింగ్ ఏజెంట్ల ద్వారా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, వివరాలు సేకరించి సన్నద్ధంగా ఉంటే ప్రక్రియను సులువుగా పూర్తిచేయొచ్చన్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున రవినాయక్, టీడీపీ తరఫున ఆదినారాయణ, కాంగ్రెస్ పార్టీ తరఫున లక్ష్మీనారాయణ, జనసేన పార్టీ ప్రతినిధి అబ్దుల్‌ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
పోస్టల్ కార్డుపై లేపాక్షి నంది
లేపాక్షి: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లేపాక్షి విశిష్టత ప్రపంచానికి తెలియజేయడానికి నంది చిత్రం కలిగిన పోస్టుకార్డు ఎంతో దోహపడతుందని ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ ప్రకాష్ అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక లేపాక్షిలోని చేతన కన్వెన్స్‌న్ హాల్‌లో నంది చిత్రంతో కూడిన శాశ్వత తపాలా ముద్రను, వీరభద్రస్వామి దేవస్థానంపై ప్రత్యేక కార్డులను ఆయన విడుదల చేశారు. ముందుగా ఇటీవల ఆపరేషన్ సింధూర్‌లో వీరమరణం పొందిన మురళీనాయక్ మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్మినెంట్ పిక్టోరియల్ కాన్సిలేషన్ ద్వారా కార్డులు విడుదల చేయడం సంతోషంగా ఉదన్నారు. ఇది లేపాక్షికి ప్రత్యేకమైన రోజన్నారు. లేపాక్షి పోస్ట్ ఆఫీసు నుంచి ఏ ఉత్తరం వచ్చినా ఈ కాన్సిలేషన్ ద్వారా ఆ ఉత్తరం వెళ్లడం జరుగుతుందన్నారు. దేశం మొత్తానికి ఈ కార్డులను పంపించవచ్చన్నారు. నంది విగ్రహం, కల్యాణ మంటపం, వినాయక విగ్రహం, ఏడు శిరస్సుల నాగేంద్రుని విగ్రహం, సీతమ్మ పాదం, వేలాడే స్తంభం చిత్రాల కార్డులను విడుదల చేశారు. ఈ కార్డులను శుభకార్యాలకు, స్నేహితులు, ఇతరులకు బహమతి ఇవ్వచ్చన్నారు. ఈ కార్డులు స్థానిక పోస్టు ఆఫీసులో అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం లేపాక్షి విశిష్టతను తెలిపేలా కవి సడ్లపల్లి చిదంబరరెడ్డి రాసిన పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కర్నూలు రీజినల్ పోస్టుమాస్టర్ జనరల్ వెన్నం ఉపేంద్ర, పోస్టల్ సూపరింటెండెంట్ విజయకుమార్, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

తప్పుల్లేని ఓటరు జాబితానే లక్ష్యం