
మధుర ఫలం.. విషతుల్యం
హిందూపురం: మామిడికి ఇప్పుడిప్పుడే మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. ఇంత కాలం ఎండల తీవ్రత కారణంగా మామిడిని కొనుగోలు చేసేందుకు ప్రజలు భయపడుతూ వచ్చారు. వర్షాలు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో మార్కెట్‌లో మామిడి కొనుగోలు దారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో వ్యాపారులు సహజ సిద్ధంగా కాకుండా ప్రమాదకర కాల్షియం కార్బైడ్‌తో మాగిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు.
దిగుబడి సైతం మోస్తారుగానే
ఈ ఏడాది మామిడి దిగుబడులు ఓ మోస్తరుగా ఉన్నాయని ఉద్యాన శాఖ అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ ప్రభావం కారణంగా ఎగుమతులపై ప్రభావం పడింది. దీంతో స్థానికంగానే మార్కెట్‌లో మామిడి విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. అయితే ఎండలు తీవ్ర ప్రభావం చూపుతుండడంతో ఇంత కాలం మామిడి కొనుగోలు చేసేందుకు పలువురు వెనుకంజ వేస్తూ వచ్చారు. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో మార్కెట్‌లో మామిడికి డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలో డిమాండ్‌కు అనుగుణంగా మామిడిని అందుబాటులో ఉంచేందుకు వ్యాపారులు అడ్డదారులు తొక్కడం మొదలు పెట్టారు. పెనుగాలులు, వర్షాలకు నేలరాలిన కాయలను తక్కువ ధరకే వ్యాపారులు కొనుగోలు చేసి త్వరగా పక్వానికి వచ్చేలా విషపూరిత కాల్షియం కార్బైడ్‌ను విచ్ఛలవిడిగా వినియోగిస్తున్నట్లుగా సమాచారం. వీటిని తిన్న వృద్ధులు, చిన్నారులు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.
ప్రమాదకర రసాయనంతో మామిడిని మాగబెడుతున్న వ్యాపారులు
వర్షాలు కురిసిన నేపథ్యంలో మామిడి కొనుగోలుకు ఎగబడుతున్న ప్రజలు
కొనుగోలు సమయంలో నాణ్యతపై
అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న నిపుణులు
నాణ్యతను గుర్తించండి ఇలా..
సహజ సిద్ధంగా మాగిన మామిడి మొత్తం ఒకే రంగులో ఉండదు. పండిన వాసనతో కోసినప్పుడు లోపలి భాగం మొత్తం ఒకే రకమైన పక్వత కనిపిస్తుంది.
ప్రమాదకర రసాయనంతో మాగేసిన పండ్లు మొత్తం ఒకే రంగులో ఉంటాయి. కోసినప్పుడు లోపలి భాగం చుట్టూ కొద్ది పక్వత కలిగి, మిగిలిన భాగం అపరిపక్వంగా ఉంటాయి.
ఇథిలీన్ వాయివుతో చాంబర్‌లో మాగిన పండ్లు ఆరోగ్యానికి మంచిది. ఇవి సహజ పరిపక్వతకు దగ్గరగా ఉంటాయి.
మామిడిని కొళాయి నుంచి వదిలే నీటిలో మూడు నిమిషాలు ఉంచి శుభ్రం చేసిన తర్వాత తొక్కను తీసి తినాలి.
నాణ్యత ఉన్న వాటినే కొనుగోలు చేయండి
మామిడిని సహజ సిద్ధంగా పండించాలి. రసాయనాలతో మాగించిన పండ్ల తొక్క ముడతలు లేకుండా గట్టిగా ఉంటుంది. ఇలాంటి పండ్లు ప్రమాదకరం. పండ్లను ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15 నుంచి 20 నిముషాలు ఉంచి తిరిగి వాటిని మంచినీటిలో కడిగి తడి లేకుండా తుడిచిన తర్వాత తినాలి. సాధ్యమైనంత వరకు పండ్ల తొక్కను తీసి తినడం మంచిది.
– మహేష్, ఉద్యానాధికారి, హిందూపురం

మధుర ఫలం.. విషతుల్యం

మధుర ఫలం.. విషతుల్యం

మధుర ఫలం.. విషతుల్యం