
యథేచ్ఛగా ఎర్రమట్టి దోపిడీ
రాయదుర్గం టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతల దోపిడీకి అంతులేకుండా పోతోంది. సహజ వనరులను యథేచ్ఛగా కొల్లగొట్టి రూ. కోట్లలో దోచేస్తున్నారు. టీడీపీ నేతల స్వార్థానికి రాయదుర్గం నియోజకవర్గంలో సహజ సిద్దంగా ఏర్పడిన కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి. గత రెండు రోజులుగా రాయదుర్గంలోని శనీశ్వరాలయం వెనుక ఉన్న హౌసింగ్ లే అవుట్‌కు ఆనుకుని కొండ ప్రాంతంలో మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. అదే ప్రాంతంలో కొండ పొరంబోకు స్థలంలో భారీ విస్తీర్ణాన్ని చదును చేసి ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు ఓ టీడీపీ నాయకుడు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు. ఎంసీఏ కళాశాల, ఇందిరమ్మ లేఅవుట్లు, గౌడ లేవుట్ సమీపంలో ఉన్న కొండల్లో నుంచి గ్రావెల్ తవ్వకాలు పెరిగిపోయాయి. రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఎర్రమట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ప్రైవేటు వ్యక్తులు తమ స్థలాలను ప్లాట్లు వేసి, రోడ్లను చదును చేసేందుకు కొండల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసినా భూగర్భ గనుల శాఖ, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.