హిందూపురం: హిందూపురం డివిజన్‌లో గ్రామీణ తపాలా జీవిత బీమా(ఆర్‌పీఎల్‌ఐ)డైరెక్ట్ ఏజెంట్లుగా పని చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈమేరకు శనివారం తపాలా శాఖ హిందూపురం సూపరింటెండెంట్ విజయ్‌కుమార్, డెవలప్‌మెంట్ ఆఫీసర్ నరసింహమూర్తి శనివారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఎస్‌వీడి రోడ్డులోని సూపరింటెండెంట్ కార్యాలయంలో ఈనెల 28 నుంచి 30(ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలు) వరకు జరిగే ఇంటర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.
టెన్త్ విద్యార్హత కల్గి 18 నుంచి 50ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులన్నారు. ఎంపికై న ఏజెంట్లు సెక్యూరిటీ డిపాజిట్ రూ.5 వేలు కెవీపీ, ఎన్‌ఎస్‌సీ రూపంలో చెల్లించాలన్నారు. వివరాలకు తపాలా శాఖ హిందూపురం సూపరింటెండెంట్ కార్యాలయం, తపాలా జీవిత బీమా డివిజన్ ఆఫీసులో సంప్రదించాలని సూచించారు.
‘హంద్రీ–నీవా’ బ్లాస్టింగ్ రాయి తగిలి బాలుడికి తీవ్రగాయాలు
పుట్టపర్తి: హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనుల్లో భాగంగా బ్లాస్టింగ్ చేయడంతో రాయి తగిలి ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు..బుక్కపట్నం మండలం జానకంపల్లి సమీపంలో హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులు జరుగుతున్నాయి. శనివారం కాలువలో రాయి ఉండటంతో దానిని పగులగొట్టేందుకు కాంట్రాక్టర్లు బ్లాస్టింగ్ చేశారు. ఈ క్రమంలో 8 నుంచి 10 కేజీల బరువున్న ఓ రాయి జానకంపల్లి ప్రధాన రహదారి వద్దకు వచ్చి తిరుమలసాయి అనే బాలుడి కాలికి తగిలింది. తీవ్రగాయాలపాలైన బాలుడిని కాంట్రాక్టర్లు మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. కాలువకు జానకంపల్లికి 200 మీటర్ల దూరం ఉందని, బ్లాస్టింగ్ సమయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు గ్రామస్తులు, బాధితుడి తల్లి దండ్రులు పేర్కొన్నారు.


