ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి
ధర్మవరం అర్బన్: ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు దామోదరరావు, ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య డిమాండ్ చేశారు. స్థానిక ఎన్జీఓ హోంలో జిల్లా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈయూ జిల్లా అధ్యక్షుడు కె.బి.నాగార్జునరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దామోదరరావు మాట్లాడుతూ... గత 12 ఏళ్లుగా ఆర్టీసీలో కారుణ్య నియామకాలు తప్ప ప్రభుత్వం ద్వారా ఇచ్చిన నోటిఫికేషన్‌తో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో వివిధ కేటగిరిలలో దాదాపు 11వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి, బడుగు, బలహీన వర్గాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పీఆర్‌సీ, డీఏ బకాయిలతో పాటు నూతన పీఆర్‌సీని ఏర్పాటు చేయాలని కోరారు. ఈహెచ్‌ఎస్ ద్వారా కనీస వైద్య సౌకర్యాలు కూడా అందడం లేదని మండిపడ్డారు. ఫలితంగా దాదాపు 350 మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రెఫరల్ ఆస్పత్రుల ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలన్నారు. సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నబీరసూల్, కడప జోన్ అధ్యక్షుడు కేకే కుమార్, జోనల్ కార్యదర్శి రాజశేఖర్, జిల్లా కార్యదర్శి వైపీ రావు, జోనల్ నాయకులు ఎన్‌సీ శేఖర్, అరుణమ్మ, జిల్లా నాయకులు నారాయణస్వామి, ఆర్‌ఎస్ రెడ్డి, ఏవీవీ ప్రసాద్, రమణప్ప, వాసులు, నరసింహులు, సుమో శీనా, తదితరులు పాల్గొన్నారు.
ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు
దామోదరరావు డిమాండ్


