రంపం.. తీసింది ప్రాణం
● రోడ్డు ప్రమాద మృతి కేసులో వీడిన మిస్టరీ
ధర్మవరం అర్బన్: ద్విచక్రవాహనంపై అజాగ్రత్తగా తీసుకొస్తున్న రంపం మరో ద్విచక్రవాహనదారుడి ప్రాణం తీసింది. రోడ్డు ప్రమాదంగా తొలుత నమోదైన ఈ కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం పట్టణంలోని మహాత్మాగాంధీ కాలనీకి చెందిన బేల్దారి ఎం.ఆంజనేయులు (50) ఈ నెల 19న రాత్రి లక్ష్మీచెన్నకేశవపురం వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆంజనేయులు మృతికి కారణం ఒక రంపమని పోలీసులు గుర్తించారు. లక్ష్మీచెన్నకేశవపురం సమీపంలోని భవనాలకు ఉన్న సీసీ కెమెరాలోని ఫుటేజీలో రాత్రి ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై పెద్ద పెద్ద చెట్లు కోసే రంపాన్ని తీసుకుని వెళుతున్నారు. ఆ సమయంలో ద్విచక్రవాహనంలో వెళుతున్న ఆంజనేయులు మెడకు పక్కనే ద్విచక్రవాహనంలో తీసుకెళుతున్న రంపం తగిలింది. దీంతో ఆంజనేయులు మెడ తెగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హఠాత్పరిణామంతో రంపం తీసుకెళుతున్న ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి ఉడాయించారు. సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీ ఆధారంగా పోలీసులు రంపం తీసుకెళుతున్న ఇద్దరు వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.
నేడు ‘పది’ ఫలితాలు
పుట్టపర్తి: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువుల్లో ఉత్తీర్ణతపై ఆందోళన నెలకొనగా... రాష్ట్రస్థాయిలో జిల్లా స్థానంపై విద్యాశాఖ అధికారులు కలవరపడుతున్నారు. మార్చి 17 నుంచి ప్రారంభమైన పది పరీక్షలు ఈనెల 1తో ముగిశాయి. జిల్లాలో రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు 22,087 మంది పరీక్షలకు హాజరయ్యారు.


