హ్యాండ్ బాల్ జిల్లా జట్ల ఎంపిక
కదిరి అర్బన్: జిల్లా హ్యాండ్‌బాల్ పురుషులు, మహిళల జట్ల ఎంపికను స్థానిక ఎస్టీఎస్‌ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ చూపిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికై న మహిళల జట్టులో మాధవి, నక్షత్ర, సభ, ఝాన్సీరాణి, స్వప్న, సమీరా, చాందిని, లేఖన, షబ్రీన్, ఫర్హానా, ఓం శ్రీ, పవిత్ర, సమిత, దివ్య, చందన, హాసిని, శ్రావణి ఉన్నారు. అలాగే పురుషుల జట్టుకు యాసిర్‌సిధ్దిఖీ, డానియల్‌రాజన్, భరత్, జస్వంత్‌నాయక్, సాదిక్‌బాషా, మహమ్మద్ అనీఫ్, ఫైజాన్, విశ్వనాథ్, సాయికుమార్, తనయ్, కుమార్, నారాయణస్వామినాయక్, ప్రవీణ్‌నాయక్, అరుణ్‌కుమార్, మల్లికార్జున, నాగరాజు ఎంపికయ్యారు. ఈ ప్రక్రియను జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు విజయ్‌కుమార్, మహేష్ పర్యవేక్షించారు.
కండక్టర్‌పై ఖాకీ దౌర్జన్యం
గుత్తి: టికెట్ తీసుకుని ప్రయాణం చేయాలని సూచించిన ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై ఓ హెడ్ కానిస్టేబుల్ బూతులతో రెచ్చిపోయారు. వివరాలు.. ఆదివారం తెల్లవారుజామున గుత్తి ఆర్టీసీ డిపో నుంచి ప్రయాణికులతో బయలుదేరిన బస్సు గార్లదిన్నె మండలం కల్లూరుకు చేరుకోగానే ఓ హెడ్ కానిస్టేబుల్ ఎక్కారు. టికెట్ తీసుకోవాలని కండక్టర్ గంగేశ్వర్ అడగడంతో తాను హెడ్ కానిస్టేబుల్‌నని, టికెట్ తీసుకునేది లేదని తెలిపారు. ‘అలా కాదు సార్.. వారెంట్ ఏదైనా ఉంటే చెప్పండి ఫ్రీ గా ప్రయాణం చేయవచ్చు. అలా కాదంటే టికెట్ తీసుకోవాల్సిందే’ అంటూ కండక్టర్ చెప్పగానే హెడ్ కానిస్టేబుల్ రెచ్చిపోయి బూతులతో విరుచుకు పడారు. ‘ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో.. అవసరమైతే కోర్డుకు పోతావా? పో’ అంటూ బెదిరింపులకు దిగారు. తాను లేకుండా బస్సు అక్కడి నుంచి ఎలా ముందుకెళుతుందో చూస్తానంటూ భీష్మించారు. దీంతో సహనం కోల్పోయిన కండక్టర్ టికెట్ తీసుకోవాల్సిందేనంటూ గట్టిగా పట్టుపట్టారు. హెడ్ కానిస్టేబుల్ నిర్వాకంతో బస్సు అక్కడే నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు కల్పించుకోవడంతో చివరకు హెడ్ కానిస్టేబుల్ టికెట్ తీసుకున్నారు. ఘటనపై పోలీసులతో పాటు ఆర్టీసీ డీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు కండక్టర్ గంగేశ్వర్ తెలిపారు. కాగా, వివాదస్పదమైన సదరు హెడ్ కానిస్టేబుల్ పేరు లక్ష్మీనారాయణ అని ప్రయాణికులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ పనిచేస్తున్నది తెలియదన్నారు. పోలీసు శాఖ ప్రతిష్టను దిగజారుస్తున్న ఇలాంటి వారిపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనంత వరకూ ఇలాంటి ఘటనలు తరచూ చూడాల్సి వస్తుందని పేర్కొన్నారు.
హ్యాండ్ బాల్ జిల్లా జట్ల ఎంపిక


