సాగునీరు అందించడంలో ఘోర వైఫల్యం
చిలమత్తూరు: ఆయకట్టుకు సాగునీరందించడంలో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక మండిపడ్డారు. ఆదివారం హిందూపురంలోని ఆంబేడ్కర్ భవనంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆద్వర్యంలో ‘సాగునీటి ప్రాజెక్ట్‌లు – విభజన హామీలు’ అంశంపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్ దీపిక మాట్లాడుతూ హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులు చేపట్టడం ద్వారా ఆయకట్టు పరిధిలోని భూములకు సమాధి కడుతున్నారన్నారు. రానున్న రోజులు నీటి కోసం యుద్ధాలు చేయాల్సి వస్తుందన్నారు. సాగునీటి ప్రాజెక్ట్‌లను కాపాడుకోవడం, వాటికి నీటిని తెప్పించడం కోసం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పలువురు ప్రముఖులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విభజన హామీలను తుంగలో తొక్కాయన్నారు. రైతులకు మేలు చేకూర్చే సాగునీటి ప్రాజెక్ట్‌లపై నిర్లక్ష్యంగా ఉన్నాయన్నారు. ప్రాజెక్ట్‌ల కోసం వచ్చిన నిధులను మళ్లిస్తూ రాష్ట్ర భవిష్యత్‌ను ప్రశ్నార్థకంలోకి నెడుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వాలు చిత్తశుద్దితో పనిచేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు శ్రీరాములు, చైతన్య గంగిరెడ్డి, శ్రీనివాసులు, శంకరయ్య, సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ నేతల
అక్రమ నిర్బంధం
సాక్షి టాస్క్ ఫోర్స్:కేసుతో సంబంధం లేకపోయినా ముగ్గురు వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, రహస్య ప్రదేశంలో అక్రమంగా నిర్బంధించడం కలకలం రేపుతోంది. అధికార టీడీపీ నేతల డైరెక్షన్‌లోనే ఇదంతా సాగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం హిందూపురం పట్టణంలోని ముద్దిరెడ్డిపల్లికి చెందిన మోహన్ అనే టీడీపీ కార్యకర్త మాజీ సీఎం వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేయడాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. నిందితుడిపై కేసు నమోదు చేయాలని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే టీడీపీ కార్యకర్త అనుచిత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ కేసును అడ్డం పెట్టుకొని ఎటువంటి సంబంధం లేని వైఎస్సార్‌సీపీ బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు వాల్మీకి లోకేష్, అంబేద్కర్ నవీన్, షేక్షా శుభకార్యంలో పాల్గొనేందుకు అనంతపురం జిల్లాకు వెళ్తుండగా శనివారం హిందూపురం టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి నిర్బంధించడం కలకలం రేపుతోంది. టీడీపీ నేతల ఒత్తిళ్ల మేరకే పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ ముగ్గురిని ఎక్కడికి తీసుకువెళ్లారు.. ఏమి చేయబోతున్నారో అని వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీరి అక్రమ నిర్బంధంపై వైఎస్సార్‌సీపీ నేత వేణురెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేస్తే రిమాండ్‌కు తరలించాలని, అలా రహస్యంగా ఎక్కడో ఉంచడం ఏంటని ప్రశ్నించారు.
వృద్ధ దంపతుల ఆత్మహత్య
అనంతపురం: అనారోగ్యంతో మనస్తాపం చెందిన వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అనంతపురం త్రీటౌన్ సీఐ కే.శాంతిలాల్ తెలిపిన మేరకు.. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వీవర్స్ కాలనీ చెందిన దేవా శివానంద (70), దేవా శాంతమ్మ (60) దంపతులు. వీరికి దేవా గోపాల్, దేవా చంద్రశేఖర్ సంతానం కాగా, హిందూపురంలో కుమారులు ఒక చోట, తల్లిదండ్రులు మరో చోట నివాసం ఉంటున్నారు. ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన శివానందకు ఇటీవల షుగర్ ఎక్కువైంది.కిడ్నీ కూడా దెబ్బతినడంతో అనంతపురం సవేరా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడలేదు. శాంతమ్మ కూడా షుగర్ వ్యాధితో బాధపడేవారు. ఈ క్రమంలోనే ఈ నెల 11న దంపతులిద్దరూ ఇంటికి తాళం వేసి అనంతపురం చేరుకున్నారు. నగర సమీపంలోని నేషనల్ పార్కు వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయారు. గుర్తించిన స్థానికులు వెంటనే ఇద్దరినీ అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించగా, చికిత్స ఫలించక శివానంద అదే రోజు ప్రాణాలు విడిచారు. శాంతమ్మ ఆదివారం మృతి చెందింది.
సాగునీరు అందించడంలో ఘోర వైఫల్యం


