మద్యం మత్తులో ఘర్షణ – ఒకరి మృతి
సోమందేపల్లి: మద్యం మత్తులో చోటు చేసుకున్న ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. సోమందేపల్లిలోని సాయినగర్‌కు చెందిన ఎరికల నారాయణప్ప (35), మారెప్ప బంధువులు. మంగళవారం నారాయణప్ప ఇంటి వద్ద ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో మారెప్ప చెయ్యి చేసుకోవడంతో నారాయణప్ప అక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కాగా, ఘర్షణలో గాయపడిన మారెప్పను స్థానిక పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అనంతరం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఆర్టీసీ బస్సు ఢీ – వ్యక్తి మృతి
సోమందేపల్లి: మండలంలోని తుంగోడు క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న చాకిల నారాయణప్ప(65) మృతి చెందాడు. లేపాక్షి మండలం కల్లూరుకు చెందిన నారాయణప్ప మంగళవారం ఉదయం సోమందేపల్లి మండలం కొలింపల్లి గ్రామంలో బంధువుల ఇంటికి వచ్చాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన తుంగోడు క్రాస్ వద్దకు చేరుకోగానే కదిరి వైపు వేగంగా వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
యువకుడి గొంతు కోసిన జనసేన కార్యకర్త
సోమందేపల్లి: గంజాయి మత్తులో జనసేన పార్టీ కార్యకర్త రెచ్చిపోయాడు. కత్తితో ఓ యువకుడి గొంతు కోశాడు. సోమవారం రాత్రి సోమందేపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి గ్రామంలో డ్రామా జరుగుతుండగా నితీష్ అనే యువకుడు అక్కడకు చేరుకున్నాడు. ఆ సమయంలో నితీష్‌తో అక్కడే ఉన్న ఈదుళబలాపురానికి చెందిన జనసేన కార్యకర్త విక్రాంత్ అకారణంగా గొడవకు దిగాడు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న విక్రాంత్ తన వద్ద ఉన్న కత్తితో నితీష్ గొంతు కోసి, వీపుపై కత్తితో పొడిచాడు. అడ్డుకోబోయిన మరో యువకుడి చేతి వేళ్లను కోశాడు. క్షతగాత్రలను స్థానికులు హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
బాలుడిపై వీధికుక్కల దాడి
వజ్రకరూరు: మండలంలోని కొనకొండ్లలోని గడ్డం వీధిలో మంగళవారం సాయంత్రం మూడేళ్ల వయసున్న బాలుడు పోతప్పపై నాలుగు వీధికుక్కలు దాడిచేశాయి. తన ఇంటి సమీపంలో బాలుడు ఆడుకుంటూ ఈ ఘటన చోటు చేసుకుంది. బాలుడు తలతో పాటు కడుపు, వీపు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. బాలుడి అరుపులు విన్న తల్లిదండ్రులు సుంకన్న, సుజాత, కాలనీ వాసులు వెంటనే అక్కడకు చేరుకుని కుక్కలను అదిలించారు. తీవ్రంగా గాయపడిన పోతప్పను తొలుత స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం గుంతకల్లుకు, అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు.


