ధర్మవరం అర్బన్: ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడిన ఘటనలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. వివరాలు... ధర్మవరానికి చెందిన అజయ్, రాము.. ఆదివారం ఉదయం రాప్తాడు మండలం మరూరులో వెలసిన చిన్నకదిరయ్యస్వామి దర్శనానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. గొల్లపల్లి వంక దాటుతున్న సమయంలో రోడ్డుకు అడ్డుగా జింకలు రావడంతో సడన్ బ్రేక్ వేశారు.
దీంతో వాహనం అదుపు తప్పి ఇద్దరూ కిందపడ్డారు. క్షతగాత్రులను అటుగా వెళుతున్న వారు గుర్తించి వెంటనే అంబులెన్స్ ద్వారా ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.


