బత్తలపల్లి: సత్యసాయి తాగునీటి పథకం...ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వందలాది గ్రామాలకు తాగునీరు అందిస్తోంది. ఈ పథకానికి సంబంధించిన పైప్‌లైన్ లీక్ కావడంతో బత్తలపల్లి, తాడిమర్రి, ధర్మవరం మండలాల్లోని 30 గ్రామాలక నీటి సరఫరా నిలిచిపోయింది. సిబ్బంది మూడు రోజులుగా శ్రమిస్తున్నా ఫలితం లేకపోయింది. వేసవి ప్రారంభమవడంతో పలు గ్రామాల్లో నీటి సమస్య ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో సత్యసాయి నీరు కూడా నిలిచిపోవడంతో ప్రజలు తాగునీటికి అల్లాడిపోతున్నారు.
కప్లింగ్ విరిగిపోవడంతో సమస్య
చిత్రావతి నది నుంచి జిల్లా కేంద్రమైన పుట్టపర్తికి సత్యసాయి తాగునీటి పథకం ద్వారా నీరు సరఫరా అవుతోంది. ఈ పథకం ప్రధాన పైపులైన్ బత్తలపల్లి మీదుగా నాలుగు లేన్ల జాతీయ రహదారి కింద వెళ్తోంది. బత్తలపల్లి పోలీస్ స్టేషన్ సమీపాన జాతీయ రహదారి కల్వర్టు కింద ప్రధాన పైపులైను జాయింట్ కప్లింగ్ విరిగిపోవడంతో సత్యసాయి నీరు లీకేజీ అవుతున్నట్లు మూడు రోజుల క్రితం సిబ్బంది గుర్తించారు. సత్యసాయి తాగునీటి పథకం సూపర్‌వైజర్లు శంకరయ్య, రాజారెడ్డి పర్యవేక్షణలో దాదాపు 20 మంది సిబ్బంది జాతీయ రహదారి మధ్యలో సుమారుగా 20 అడుగుల లోతు తవ్వి కప్లింగ్ వేసేందుకు మూడు రోజులుగా శ్రమిస్తున్నారు. మంగళవారం రాత్రికి పైపులైనుకు జాయింట్ కప్లింగ్ తొడిగించి పనులు పూర్తి చేసి బుధవారం సత్యసాయి నీరు అందేలా చూస్తామని సత్యసాయి మంచినీటి పథకం సూపర్‌వైజర్లు వెల్లడించారు.
మెయిన్ పైపు లీక్ కావడమే కారణం
మూడు రోజులుగా శ్రమిస్తున్నా దక్కని ఫలితం
30 గ్రామాలకు సత్యసాయి నీరు బంద్


