పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 60 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్, మహిళా పీఎస్ డీఎస్పీ ఆదినారాయణ, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, హోళీ సందర్భంగా ఈ నెల 14న కదిరిలోని ఎస్‌కేఎల్‌ఎన్‌ఎస్ అమృతవళ్లి మహిళా డిగ్రీ కళాశాలలో చోటు చేసుకున్న ఘటనపై న్యాయం చేయాలంటూ డీఎస్పీ విజయ్‌కుమార్‌కు విద్యార్థినులు వినతి పత్రం అందజేశారు. తమ అభ్యర్థన మేరకే హోళీ జరుపుకునేందుకు ప్రిన్సిపాల్ వెంకటపతి అనుమతించారని, అంతేకాక తన సతీమణితో కలసి వేడుకల్లో ఆయన పాల్గొన్నారని వివరించారు. సరదాగా కేరింతలు కొడుతున్న సమయంలో గిట్టని కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ తండ్రి లాంటి వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేశారనే ఆరోపణలను తాము ఆక్షేపిస్తున్నామని, ఈ అంశంలో సమగ్ర విచారణ చేపట్టి ప్రిన్సిపాల్‌కు న్యాయం చేయాలంటూ కోరారు.


