హిందూపురం: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానమే సద్దాం హత్యకు కారణమైందని హిందూపురం డీఎస్పీ మహేష్ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులు నలుగురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. శుక్రవారం స్థానిక పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. హిందూపురం పట్టణానికి చెందిన షేక్ మహమ్మద్ షఫీ, రేష్మా అలియాస్ ఆయేషా దంపతులు. కుటుంబ పోషణకు స్థానిక ఓ రీలింగ్ యూనిట్‌లో ఆయేషా కార్మికురాలిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో అక్కడే పనిచేస్తున్న సద్దాం బేగ్ పరిచయమయ్యాడు. ఇద్దరూ సన్నిహితంగా ఉండేవారు. ఈ విషయం తెలుసుకున్న షఫీ... తన భార్యపై అనుమానాలు పెంచుకుని ఈ నెల 15న ఆస్పత్రి వద్ద సద్దాం బేగ్‌తో గొడవపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి అందిన ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. దీంతో కక్ష పెంచుకున్న షఫీ.. ఈ నెల 17న రాత్రి తన కుటుంబసభ్యులతో కలసి సద్దాం బేగ్‌ను ద్విచక్ర వాహనంపై అపహరించి, మలుగూరు చెరువు కట్ట కింద వేట కొడవండ్లతో దాడి చేసి హతమార్చాడు. హతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు పక్కా ఆధారాలతో కొట్నూర్ శివారులో తచ్చాడుతున్న షేక్ మహమ్మద్ షషీతోపాటు అతని తమ్ముడు తౌఫిక్, చెల్లెలు రేష్మా, తల్లి సల్మాను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
సద్దాం హత్య కేసులో వీడిన మిస్టరీ
నలుగురు నిందితుల అరెస్ట్