కదిరి: వసంత వల్లభుడిగా పేరు గాంచిన ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ఐరావతం (గజవాహనం)పై దర్శనమిచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగునున్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఐరావతంపై కాటమరాయుడి కమనీయ రూపాన్ని చూసి తరించారు. అనంతరం శ్రీవారు తిరిగి ఆలయంలోకి వెళ్లి పూజలందుకున్నారు. గురువారం తెల్లవారుజామున శ్రీవారు రథంపైకి ప్రవేశించనున్నారు. శ్రీదేవి, భూదేవిలను కంకణ భట్టాచార్యులు రథంపైకి తీసుకు రానున్నారు. అంతకుముందు అర్చకులు యాగశాలలో నిత్య హోమాలు నిర్వహించి రథ కలశ పూజలు చేశారు. ఆ తర్వాత దాన్ని శ్రీవారి బ్రహ్మ రథంపై ప్రతిష్టించారు. శ్రీవారికి నిత్య కై ంకర్య సేవలు నిర్వహించిన మీదట బ్రహ్మరథం వద్ద శుద్ధి పుణ్య హవచనం, వాస్తు హోమాలు, రథాంగ హోమాలు, రథ సంప్రోక్షణ చేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి.