
ఆర్థిక ఇబ్బందులు తాళలేక మాజీ వలంటీర్ ఆత్మహత్య
గుత్తి: తల్లి ఆపరేషన్ కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక గ్రామ సచివాలయ మాజీ వలంటీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం గోరిమానుపల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు, మణెమ్మ దంపతుల కుమారుడు మహేంద్ర గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆ గ్రామ సచివాలయ వలంటీర్‌గా పనిచేశాడు. ఆ సమయంలోనే తన తల్లికి శస్త్రచికిత్స అవసరం కావడంతో రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈలోపు రాష్ట్రంలో అధికారం మారి కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. వలంటీర్ వ్యవస్థను సీఎం చంద్రబాబు రద్దు చేయడంతో అప్పు ఎలా తీర్చాలో తెలియక మదనపడ్డాడు. వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లు తీవ్రం కావడంతో యాడికి మండలం బోయరెడ్డిపల్లి వద్ద ఉన్న పెన్నా సిమెంట్స్ పరిశ్రమలో పనిలోకి చేరాడు. ఈ క్రమంలోనే తమ అప్పు తీర్చాలంటూ వడ్డీ వ్యాపారుల నుంచి వేధింపులు తీవ్రమయ్యాయి. దీంతో దిక్కుతోచని మహేంద్ర (26) నాలుగు రోజుల క్రితం ఫ్యాక్టరీకి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వచ్చాడు. అప్పటి నుంచి తిరిగి ఇంటికి వెళ్లలేదు. బుధవారం ఉదయం గుత్తి రైల్వేస్టేషన్‌కు చేరుకున్న మహేంద్ర...జీఆర్పీ స్టేషన్ ఎదుట అందరూ చూస్తుండగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాలను బట్టి ఆచూకీని గుర్తించిన జీఆర్పీ ఎస్‌ఐ నాగప్ప సమాచారంతో మహేంద్ర తల్లిదండ్రులు గుత్తికి చేరుకున్నారు. కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఆర్థిక సమస్యలతోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
పాత బస్టాండ్ వద్ద
వ్యక్తి మృతదేహం
రాయదుర్గం టౌన్: స్థానిక పాత బస్టాండ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ వెనుక గుర్తు తెలియని వ్యక్తి (55) మృతదేహాన్ని స్థానికులు బుధవారం ఉదయం గుర్తించారు. సమాచారం అందుకున్న సీఐ జయానాయక్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రిలోని మార్చురీ గదికి తరలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో ఫొటోలను వైరల్ చేశారు. ఆచూకీ తెలిసిన వారు రాయదుర్గం పోలీసులను సంప్రదించాలని సీఐ కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. కాగా, రెండు రోజులుగా సదరు వ్యక్తి ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా స్థానికుల ద్వారా తెలిసింది. అతిగా మద్యం సేవించడంతో పాటు వడదెబ్బకు గురై మృతి చెంది ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఆర్థిక ఇబ్బందులు తాళలేక మాజీ వలంటీర్ ఆత్మహత్య