నేత్రపర్వం.. భూతప్పల ఉత్సవం
రొళ్ల: మండల కేంద్రంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం భూతప్ప ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. ఉత్సవానికి ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యంలో భక్తులు మంగళవారం సాయంత్రమే తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. స్వామి మూల విరాట్‌కు బుధవారం తెల్లవారుజామున అభిషేకం, అంకురార్పణ, కుంకుమార్చన, తులసీపూజ చేశారు. అనంతరం వెండి, బంగారు ఆభరణాలతో పాటు పంచ లోహ కవచాలతో అలంకరణ చేశారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు, సంతానం లేని మహిళలు, పెళ్లిళ్లు కాని యువతులు, ఇతర కుటుంబసమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు వేకువజామునే చన్నీటి స్నానంచేసి తడి దుస్తులతోనే స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఈరముద్దమ్మదేవి ఆలయం నుంచి ప్రధాన ఆలయం వరకూ దాదాపు కిలోమీటర్ల మేర భక్తులు భూతప్పల పాద స్పర్శ కోసం బోర్ల పడుకున్నారు. మారుతీ కాలనీ సమీపంలోని ముత్తరాయస్వామి ఆలయంలో విశేష పూజల అనంతరం మేళతాళాలతో పాదాల బండ వద్ద నుంచి బయలుదేరిన భూతప్పలు నృత్యం చేస్తూ భక్తుల మీదుగా ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ప్రధాన ఆలయంతో పాటు సమీపాన ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలోనూ పూజలు చేశారు. తమ మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు సమర్పించిన బొరుగులను ఆంజనేయస్వామి ఆలయంలో రాసిగా పోసి, దాని చుట్టూ ఉరాల శబ్ధాల నడుమ భూతప్పలు నాట్యం చేస్తూ బొరుగులను ఆరగించారు. అనంతరం బొరుగులను భక్తులకు ప్రసాదంగా పంచారు. ఉత్సవానికి తరలి వచ్చిన భక్తుల సౌకర్యార్థం 8 ప్రాంతాల్లో అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 4.30 గంటలకు లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో వెలసిన భూతప్ప ఆలయం వద్దకు చేరుకుని పట్టం కూర్చొబెట్టారు. ఉత్సవాల్లో ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ప్రొబేషనరీ డీఎస్పీ ఉదయపావని నేతృత్వంలో మడకశిర సీఐ రాజ్‌కుమార్, ఎస్‌ఐలు వీరాంజినేయులు, ఇషాక్‌బాషా, సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేడు ప్రసాద వితరణ..
లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం భూతప్పస్వామి ఆలయం ఆవరణలో భక్తులు సమర్పించిన వడి బియ్యం, బెల్లం తదితర వాటితో 101 వడలు చేసి నైవేద్యం సమర్పించనున్నారు. అనంతరం భక్తులకు ప్రసాద రూపంగా పంపిణీ చేయనున్నారు.
భూతప్పల కాలిస్పర్శ కోసం
పోటెత్తిన భక్తులు
నేత్రపర్వం.. భూతప్పల ఉత్సవం
నేత్రపర్వం.. భూతప్పల ఉత్సవం


