
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
పెనుకొండ: స్థానిక నగర పంచాయతీ పరిధిలోని ఇస్లాపురం గ్రామ సమీపంలో చోటు చేసుకున్న విశ్రాంత ఉపాధ్యాయుడి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేవారు. వివరాలను మంగళవారం సీఐ రాఘవన్ వెల్లడించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు ఆంజనేయులు అదే గ్రామానికి చెందిన తిప్పమ్మతో కొన్నేళ్లుగా సహజీవనం సాగిస్తున్నాడు. ఉద్యోగ విరమణ అనంతరంరామె వద్దనే ఉంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత కారణాలతో మూడు నెలల క్రితం ఆయనను తిప్పమ్మ కుమారుడు నాగరాజు హత మార్చి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తొలుత సాధారణ మృతిగా భావించినా... ఆంజనేయులు సోదరులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఆంజనేయులుది సాధారణ మరణం కాదని, హత్యగా నిర్ధారణ కావడంతో పక్కా ఆధారాలతో మంగళవారం నాగరాజును అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
చెట్టుపై నుంచి పడి
వృద్ధుడి మృతి
అగళి: ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడి ఓ వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... అగళి మండలం పూజారిపల్లికి చెందిన చంద్రప్ప (72) కూలి పనులతో జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు భార్యలు కాగా, మొదటి భార్య శివలింగమ్మకు సంతానం లేకపోవడంతో అంజనమ్మను రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. పి.బ్యాడగెర గ్రామానికి చెందిన రైతు సత్యప్ప పొలంలో చింత ఫలసాయాన్ని కొనుగోలు చేసిన గుడిబండ మండలానికి చెందిన రామకృష్ణప్ప సోమవారం పలువురు కూలీలను పనిలో పెట్టాడు. ఈ క్రమంలో చెట్టుపైకి ఎక్కి చింత కాయలు దులుపుతున్న చంద్రప్ప ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను తోటి కూలీలు వెంటనే మడకశిరలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక అదే రోజు రాత్రి ఆయన మృతి చెందాడు. మృతుడి కుమారుడు మారుతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
రాచువారిపల్లిలో చోరీ
తనకల్లు: మండలంలోని రాచువారిపల్లిలో నివాసముంటున్న దేశాయి భక్తవత్సలరెడ్డి ఇంట్లో మంగళవారం చోరీ జరిగింది. ఇంటికి తాళాం వేసి తన కుటుంబసభ్యులతో కలసి పది రోజుల క్రితం ఆయన కాశీకి వెళ్లారు. తాళం వేసిన ఇంటిని గమనించిన దుండగులు మంగళవారం పట్టపగలే ఇంటి వెనుక ఉన్న తలుపు తెరిచి లోపలికి ప్రవేశించారు. మూడు బెడ్‌రూములలో ఉన్న బీరువాలను ధ్వంసం చేసి అందులోని పట్టు చీరలు, ఇతర విలువైన సామగ్రిని అపహరించారు. భక్తవత్సలరెడ్డి సమీప బంధువు సమాచారంతో ఎస్‌ఐ గోపి అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలో దింపి నిందితుల వేలి ముద్రలను సేకరించారు. కాగా, ఇంటి యజమాని వచ్చిన తర్వాత ఏఏ వస్తువులు చోరీకి గురయ్యాయో తెలుసుకుని కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
తరగతి గదిలో విద్యార్థికి తేలు కాటు
పెనుకొండ రూరల్: తరగతి గదిలో పాఠాలు వింటున్న ఓ విద్యార్థిని తేలు కుట్టింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే...మండల పరిధిలోని శెట్టిపల్లి గ్రామానికి చెందిన మహికాంత్ రెడ్డి స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుకుంటున్నాడు. మంగళవారం ఉదయం ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లాడు. ఉదయం తరగతి గదిలో పాఠాలు వింటుండగా ఏదో కుట్టినట్లు విపరీతమైన నొప్పి వచ్చింది. వెంటనే ఉపాధ్యాయులకు చూపించగా... తేలు మూడుచోట్ల కుట్టినట్లు గుర్తించి వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో పాటు పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు.

హత్య కేసులో నిందితుడి అరెస్ట్