హిందూపురం: రాయలసీమలో నిత్య కరువులు, వలసలు, రైతు ఆత్మహత్యలకు కారకులెవరని జలసాధన సమితి సభ్యులు ప్రశ్నించారు. హంద్రీ–నీవా ప్రాజెక్టు ప్రధాన కాలువ లైనింగ్ పనులు రద్దుచేసి కాలువ వెడల్పు చేయాలని కోరుతూ జలసాధన సమితి ఆధ్వర్యంలో శనివారం హిందూపురంలోని ఇందిరా పార్కు కల్లూరు సుబ్బారావు విగ్రహం వద్ద జలసాధన సమితి నాయకులు కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన కలెక్టర్ చేతన్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జలసాధన సమితి గౌరవాధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ రామచంద్రారెడ్డి, అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి, ఓపిడిఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తున్నప్పటికీ ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదన్నారు. కొన్ని చెరువులు మాత్రమే నీరు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్నారు. వాస్తవంగా విడుదల అవుతున్న 27 టీఎంసీలు నీటిలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు 24 టీఎంసీలు వచ్చాయన్నారు. ఉమ్మడి జిల్లాలో 2,500 చెరువులు ఉండగా.. 89 చెరువులకు మాత్రమే నీరు ఇస్తున్నారన్నారు. హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేసి వంద టీఎంసీలను ఎత్తిపోతలతో కొత్త ఆయకట్టుకు నీరు ఇస్తే ఉమ్మడి జిల్లాలకు విస్తృత ప్రయోజనాలు ఉంటాయన్నారు. అలాకాకుండా కాలువను వెడల్పు చేయకుండా లైనింగ్ చేయటం వల్ల ప్రయోజనం లేకపోగా నష్టమే ఎక్కువగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జలసాధన సమితి ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, రచయిత సడ్లపల్లి చిదంబరరెడ్డి, రైతు సంఘం నాయకులు సిద్ధారెడ్డి, జలసాధన సమితి నాయకులు ఫరూక్, జమీల్, అమానుల్లా, దాసరి హరి, సీఐటీయూ నాయకులు రాము, పర్యావరణవేత్త భాస్కర్‌రెడ్డి, ఎస్‌యూసీఐ నాయకులు గిరీష్, తదితరులు పాల్గొన్నారు.