
సెల్‌ఫోన్ చూడొద్దన్నందుకు టెన్త్ విద్యార్థి పరార్
● రైల్వే స్టేషన్‌లో గుర్తించిన పోలీసులు
పెనుకొండ: పరీక్షల వేళ సెల్‌ఫోన్ చూడవద్దని తండ్రి మందలించాడని పదో తరగతి విద్యార్థి ఇంటినుంచి పరారయ్యాడు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని నారాయణమ్మ కాలనీ సమీపాన నివాసముంటున్నా లికిరెడ్డి వాయునందన్‌రెడ్డి పదో తరగతి చదువుతున్నాడు. సోమవారం నుంచి పరీక్షలు మొదలవుతాయి. అయితే శుక్రవారం రాత్రి సెల్‌ఫోన్ చూస్తుండడంతో తండ్రి నాగార్జునరెడ్డి గమనించి గట్టిగా మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన వాయునందన్‌రెడ్డి ఇంటినుంచి పరారయ్యాడు. కుమారుడు ఎంత సేపైనా ఇంటికి రాకపోవడంతో పలు చోట్ల వెదికిన తండ్రి, ఇతర కుటుంబసభ్యులు అదేరోజు రాత్రి 11 గంటల తర్వాత ఎస్‌ఐ వెంకటేశ్వర్లును కలసి ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ వెంటనే పోలీసు సిబ్బందితో బస్టాండ్, రైల్వేస్టేషన్, జాతీయ రహదారి, పలు హోటళ్ల వద్ద గాలింపు చేపట్టారు. చివరకు రైల్వేస్టేషన్‌లో దాక్కుని ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకుని, విద్యార్థిని మందలించి చక్కగా చదువుకోవాలని, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. అనంతరం తల్లిదండ్రులకు బాలుడిని అప్పగించారు.
చికిత్స పొందుతు చిన్నారి మృతి
రొళ్ల: మడకశిర సమీపాన వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొడగార్లగుట్లకు చెందిన సన్నలింగప్ప కుమార్తె ప్రార్థన (3) శనివారం మృతి చెందింది. ఇదే ప్రమాదంలో సన్నలింగప్ప కుమారుడు గోకుల్ గాయపడి ఆస్పత్రిలో కోలుకుంటున్న విషయం విదితమే. కాగా ప్రార్థన అంత్యక్రియలు సాయంత్రం స్వగ్రామంలో పూర్తి చేశారు.
గుప్తనిధి తవ్వకాల కేసులో ఐదుగురి అరెస్ట్
నల్లమాడ: గుప్త నిధి కోసం తవ్వకాలు చేపట్టిన కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నరేంద్రరెడ్డి శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. మండల కేంద్రానికి సమీపంలోని సుంకులమ్మ గుడి వద్ద గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో తమ సిబ్బందితో హుటాహుటిన వెళ్లి ఐదుగురిని అరెస్ట్ చేశామన్నారు. గోరంట్లకు చెందిన మారుతీకుమార్, శ్రీరాములు, నరసింహులు, హారీఫుల్లా, గోపీ అరెస్టయిన వారిలో ఉన్నారు. వీరి నుంచి కారు, తవ్వకాలకు ఉపయోగించిన వస్తువులను సీజ్ చేశామన్నారు.
చెట్టుపై నుంచి పడి
కూలీ మృత్యువాత
పావగడ: కుందుర్పి మండలం శ్రీమజ్జనపల్లికి చెందిన వ్యవసాయ కూలీ కెంచయ్య (42) శనివారం చింతచెట్టుపైనుంచి ప్రమాదవశాత్తూ కిందపడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... కెంచయ్య రోజువారీ కూలి పనుల్లో భాగంగా శనివారం ఉదయం చింతకాయలు కోయడానికి సమీపంలోని పుట్రాళ్లపల్లి వద్దకు వెళ్లాడు. అక్కడ చింతకాయలు కోసే క్రమంలో కాలుజారి చెట్టుపైనుంచి కింద పడ్డాడు. తలకు, మర్మావయవాలకు తీవ్రగాయాలవడంతో వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కెంచయ్యకు భార్య నేత్ర, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సెల్‌ఫోన్ చూడొద్దన్నందుకు టెన్త్ విద్యార్థి పరార్