కదిలింది.. కణివె నృసింహుడి బ్రహ్మరథం
పావగడ: స్థానిక కణివె లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఎండోమెంట్ అధికారి, స్థానిక తహసీల్దార్ వరద రాజు సమక్షంలో ఆలయం నుంచి లక్ష్మీదేవి సమేత నరసింహస్వామి ఉత్సవ మూర్తులను వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య అందంగా అలంకరించిన బ్రహ్మరథంలో ప్రతిష్టించారు. అనంతరం 12.45 గంటల సమయంలో ఎండోమెంట్ అధికారి వరదరాజు తదితర ప్రముఖులు లాంఛన ప్రాయంగా లాగి బ్రహ్మ రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి పాదాల గోవిందా గోవింద... అనే నామ స్మరణ మార్మోగింది. అనంతరం ఆలయం బయట నిలిపిన బ్రహ్మ రథానికి భక్తులు టెంకాయలు కొట్టి ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులకు భక్త మండలి పదాధికారులు అన్నదానం చేపట్టారు. సీఐ సురేశ్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.


